లంకతో తొలి వన్డే.. సూపర్‌ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి 

10 Jan, 2023 17:47 IST|Sakshi

IND VS SL 1st ODI: గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్‌గా 73వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లోనే వన్డేల్లో 12500 పరుగుల మైలరాయిని చేరుకున్న కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని బాదాడు. తద్వారా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ పేరిట ఉన్న ఓ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకున్నాడు.

అలాగే సచిన్‌ పేరిట ఉన్న మరో రికార్డును కింగ్‌ సమం చేశాడు. స్వదేశంలో సచిన్‌ 164 మ్యాచ్‌ల్లో 20 సెం‍చరీలు సాధిస్తే.. రన్‌మెషీన్‌ కేవలం 101 మ్యాచ్‌ల్లోనే 20 శతకాలు పూర్తి చేశాడు. 1214 రోజుల పాటు సెంచరీ లేక ముప్పేట దాడిని ఎదుర్కొన్న కోహ్లి ఆసియా కప్‌-2022లో ఆఫ్ఘనిస్తాన్‌పై టీ20 శతకం తర్వాత వన్డేల్లో వరుస మ్యాచ్‌ల్లో (బంగ్లాదేశ్‌, శ్రీలంక) శతకాలు బాదాడు. ఈ సెంచరీ ద్వారా కోహ్లి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సచిన్‌ కూడా వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించినప్పటికీ శ్రీలంకపై 8 సెంచరీలతోనే ఆగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 113 పరుగులు చేసిన కోహ్లి.. తన వన్డే కెరీర్‌లో ఓ జట్టుపై అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్‌ చేశాడు. కోహ్లి తన వన్డే కెరీర్‌లో అత్యధికంగా శ్రీలంకపై 2264 పరుగుల చేయగా.. వెస్టిండీస్‌పై 2261, ఆస్ట్రేలియాపై 2083. సౌతాఫ్రికాపై 1403 పరుగులు చేశాడు.   

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో, రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లంక బౌలర్లలో కసున్‌ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు