సెంచరీ, డబుల్‌ సెంచరీ చేసినా టీమిండియాలో చోటుకు దిక్కు లేదు.. ఏంటీ పరిస్థితి..?

10 Jan, 2023 16:53 IST|Sakshi

IND VS SL 1st ODI: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య గౌహతి వేదికగా ఇవాళ (జనవరి 10) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70), విరాట్‌ కోహ్లి (79 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో 41 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కోహ్లికి జతగా హార్ధిక్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (28), కేఎల్‌ రాహుల్‌ (39)లకు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ.. అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. లంక బౌలర్లలో మధుశంక, దసున్‌ షనక, ధనంజయ డిసిల్వలకు తలో వికెట్‌ దక్కింది. 

కాగా, ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు పలు వివాదాలకు తెరలేపింది. పలువురు ఆటగాళ్లు తమ చివరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించినా.. తుది జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఈ విషయమే ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత మ్యాచ్‌లో (లంకతో మూడో టీ20) విధ్వంసకర శతకం సాధించిన సూర్యకుమార్‌, తానాడిన చివరి వన్డేలో (బంగ్లాతో  మూడో వన్డే) ఏకంగా డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ (8 వికెట్లు, 40 పరుగులు) లంకతో జరుగుతున్న తొలి వన్డేలో చోటు దక్కించుకోలేకపోయారు.

ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నా, జట్టు సమతూకం పేరుతో వారిని పక్కకు పెట్టడం ఎంత మాత్రం సమజసం కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ఫామ్‌లో లేని కేఎల్‌ రాహుల్‌ కోసం సూర్యకుమార్‌ యాదవ్‌ను తుది జట్టు నుంచి తప్పించడం విఢ్డూరంగా ఉందని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మంచి ఫామ్‌లో ఉన్న కుల్దీప్‌ యాదవ్‌ను కాదని చహల్‌ను ఆడించడం ఏంటని మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇషాన్‌ కిషన్‌ విషయం‍లో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అంటున్నారు. ఆటగాళ్లు రాణిస్తున్నా ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెడితే మిగతా ఆటగాళ్లలో కూడా అభద్రతా భావం పెరుగుతుందని కామెంట్స్‌ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు