Ind Vs Sl 1st T20: ఏ స్థానంలో ఆడామన్నది ముఖ్యం కాదు.. పోటీ ఉంటుంది కదా.. కాబట్టి: ఇషాన్‌ కిషన్‌

25 Feb, 2022 12:41 IST|Sakshi

India Vs Sri Lanka T20 Series: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జోడీగా ఓపెనింగ్‌కు దిగిన అతడు 56 బంతులు ఎదుర్కొని 89 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్‌ కిషన్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధంగా ఉంటానన్నాడు. ‘‘టీమిండియాకు ఆడుతున్న సమయంలో వచ్చిన ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం. జట్టులో ఇతర ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నపుడు కచ్చితంగా పోటీ ఉంటుంది.

అలాంటప్పుడు కచ్చితంగా నేను ఈ స్థానంలోనే ఆడాలి అనుకోవడం సరికాదు. నెట్స్‌లో సీనియర్లను గమనిస్తూ.. వాళ్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలి. వాళ్ల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది’’ అని ఇషాన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో అత్యధిక ధర(రూ. 15.25 కోట్లు)కు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఇషాన్‌ కిషన్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అతడు టీమిండియా టీ20 జట్టులోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇక టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచిన రోహిత్‌ సేన 1-0 ఆధిక్యం సాధించింది. 
స్కోర్లు:
ఇండియా- 199/2 (20)
శ్రీలంక- 137/6 (20)

చదవండి: IND VS SL 1st T20: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్‌

మరిన్ని వార్తలు