Sourav Ganguly: కోహ్లి వందో టెస్ట్‌లో సెంచరీ కొట్టాలి.. ఆ మ్యాచ్‌ చూసేందుకు నేను కూడా వస్తా..! 

2 Mar, 2022 20:22 IST|Sakshi

గతేడాది టీ20 ప్రపంచకప్ అనంతరం గంగూలీ-కోహ్లిల మధ్య కెప్టెన్సీ విషయంలో మొదలైన వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. ఈనెల 4 నుంచి మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్ట్‌ కోహ్లి కెరీర్‌లో వందో టెస్ట్‌ మ్యాచ్‌ కాగా, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందు​కు తాను కూడా హాజరవుతానని గంగూలీ స్వయంగా ప్రకటించాడు. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లిన గంగూలీ.. బ్రిటిష్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. కోహ్లితో విభేదాల గురించి మీడియా ప్రశ్నించగా.. దాదా వాటిని కొట్టిపారేశాడు. వంద టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడటం ప్రస్తుత తరంలో అంత సులువు కాదని, భారత క్రికెట్‌లో అతి తక్కువ మంది మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారని పేర్కొన్నాడు. 

100 టెస్ట్‌ల మైలురాయిని అందుకోవాలంటే సదరు వ్యక్తి గొప్ప ప్లేయర్ అయి ఉండాలని, కోహ్లి ఆ కోవలోకే వస్తాడని పరుగుల యంత్రాన్ని ఆకాశానికెత్తాడు. గత కొంతకాలంగా కోహ్లి ఫామ్‌ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని, మొహాలీ టెస్ట్‌లో కోహ్లి శతక దాహాన్ని తప్పక తీర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా కూడా కోహ్లి ఫామ్‌ కోల్పోయి ఇబ్బందిపడ్డాడని, ఆ తర్వాత కొద్ది రోజులకే గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడని గుర్తు చేశాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా 2002-2005 మధ్య  గడ్డుకాలం ఎదుర్కున్నాడని,ఆ తర్వాత అతను కూడా తిరిగి పుంజుకున్నాడని, గొప్ప ఆటగాళ్ల  కెరీర్‌లో ఇవన్నీ సహజమేనని చెప్పుకొచ్చాడు. కాగా, కోహ్లి వందో టెస్ట్‌ను ప్రత్యక్షంగా మైదానంలో వీక్షించేందుకు తొలుత ప్రేక్షకులను అనుమతించని బీసీసీఐ.. ఆ తర్వాత అభిమానుల నిరసనలతో దిగొచ్చింది. స్టేడియంలోకి 50 శాతం ప్రేక్షకులకు అనుమతివ్వాలని నిర్ణయించింది. 
చదవండి: IND VS SL 1st Test: కోహ్లి ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎట్టకేలకు దిగొచ్చిన బీసీసీఐ

మరిన్ని వార్తలు