దీపక్‌ చహర్‌ అద్భుతం.. టీమిండియా ఘనవిజయం

21 Jul, 2021 02:02 IST|Sakshi
భువనేశ్వర్, దీపక్‌ చహర్‌ సంబరం

భారత బౌలర్‌ అద్భుత ఇన్నింగ్స్‌

రెండో వన్డేలో లంకపై విజయంతో సిరీస్‌ టీమిండియా సొంతం

రాణించిన సూర్యకుమార్‌

కొలంబో: దీపక్‌ చహర్‌ అద్భుతం చేశాడు. ఒంటిచేత్తో టీమిండియాకు పరాభవాన్ని తప్పించాడు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ విఫలమైన చోట నేనున్నానంటూ భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత్‌ మూడు వికెట్లతో శ్రీలంకపై గెలుపొందింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు.

భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది.
 
భారత్‌కు బ్రేక్‌ ఇచ్చిన చహల్‌ 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భానుక (42 బంతుల్లో 36; 6 ఫోర్లు) మరోసారి శుభారంభం చేశారు. ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున సాధించారు. ఈ క్రమంలో కొన్ని చూడచక్కని బౌండరీలు సాధించారు. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 59/0గా నిలిచింది. భారత్‌కు చహల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. 14వ ఓవర్‌ వేసిన అతను వరుస బంతుల్లో మినోద్, రాజపక్స (0)లను అవుట్‌ చేశాడు. హాఫ్‌ సెంచరీ చేసిన అవిష్క ఫెర్నాండోను భువనేశ్వర్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత కూడా భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు సాధించడంతో శ్రీలంక 40 ఓవర్లు పూర్తయ్యేసరికి 195/6 గా నిలిచింది. ఈ దశలో క్రీజులో ఉన్న అసలంక, కరుణరత్నే  దూకుడుగా ఆడారు. ఏడో వికెట్‌కు 50 పరుగులు జోడించారు.  

పేలవ ఆరంభం 
ఛేజింగ్‌ను భారత్‌ పేలవంగా ఆరంభించింది. తొలి వన్డే హీరోలు పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1), శిఖర్‌ ధావన్‌ (29; 6 ఫోర్లు) త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను పాండే, సూర్యకుమార్‌ తీసుకున్నారు. అయితే మనీశ్‌ పాండేను (31 బంతుల్లో 37; 3 ఫోర్లు) దురదృష్టం వెంటాడింది. షనక బౌలింగ్‌లో సూర్యకుమార్‌ స్ట్రయిట్‌ డ్రైవ్‌ ఆడగా... బంతి బౌలర్‌ చేతిని తాకుతూ నాన్‌స్ట్రయికింగ్‌ ఎండ్‌లోని వికెట్లను గిరాటేసింది. అదే సమయంలో పరుగు కోసం పాండే క్రీజును వదిలి ముందుకు రావడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో హార్దిక్‌ (0) కూడా అవుటవ్వడంతో భారత్‌ 116 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో సూర్యకుమార్, కృనాల్‌ ఉండటంతో భారత్‌ గెలుపుపై ధీమాగానే కనిపించింది. సందకన్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన సూర్య వన్డేల్లో తొలి ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఎల్బీగా వెనుదిరగాడు. కాసేపటికే కృనాల్‌ (35; 3 ఫోర్లు) హసరంగ బౌలింగ్‌లో బౌల్డ్‌ అవ్వడంతో భారత్‌కు ఓటమి తప్పదనిపించింది. 

దీపక్‌ వీరోచిత పోరాటం 
ఎనిమిదో నంబర్‌లో వచ్చిన దీపక్‌ తనలోని బ్యాట్స్‌మన్‌ను పరిచయం చేశాడు. కృనాల్‌ ఉన్నంతసేపు డిఫెన్స్‌ ఆడిన దీపక్‌... అతను అవుటయ్యాక జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. భువనేశ్వర్‌ (19 నాటౌట్‌; 2 ఫోర్లు) సాయంతో జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. సందకన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాదిన దీపక్‌... ఆ తర్వాతి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఈ క్రమం లో 64 బంతుల్లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. కండరాలు పట్టేయడంతో చికిత్స తీసుకున్న దీపక్‌ నొప్పిని భరిస్తూనే ఫోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అజేయమైన 8వ వికెట్‌కు భువనేశ్వర్‌తో కలిసి దీపక్‌ 84 పరుగులు జోడించాడు.

స్కోరు వివరాలు 
శ్రీలంక ఇన్నింగ్స్‌: అవిష్క (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 50; భానుక (సి) మనీశ్‌ (బి) చహల్‌ 36; రాజపక్స (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) చహల్‌ 0; ధనంజయ (సి) ధావన్‌ (బి) చహర్‌ 32; చరిత్‌ అసలంక (సి) (సబ్‌) పడిక్కల్‌ (బి) భువనేశ్వర్‌ 65; షనక (బి) చహల్‌ 16; హసరంగ (బి) చహర్‌ 8; కరుణరత్నే (నాటౌట్‌) 44; చమీర (సి) (సబ్‌) పడిక్కల్‌ (బి) భువనేశ్వర్‌ 2; సందకన్‌ (రనౌట్‌) 0; కసున్‌ రజిత (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 275.
వికెట్ల పతనం: 1–77, 2–77, 3–124, 4–134, 5–172, 6–194, 7–244, 8–264, 9–266.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10–0– 54–3, దీపక్‌ చహర్‌ 8–0–53–2, హార్దిక్‌ 4–0–20–0, చహల్‌ 10–1–50–3, కుల్దీప్‌ 10–0–55–1, కృనాల్‌ 8–0–37–0. 

భారత ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) హసరంగ 13; ధావన్‌ (ఎల్బీ) (బి) హసరంగ 29; ఇషాన్‌ (బి) రజిత 1; పాండే (రనౌట్‌) 37; సూర్యకుమార్‌ (ఎల్బీ) (బి) సందకన్‌ 53; హార్దిక్‌ (సి) ధనంజయ (బి) షనక 0; కృనాల్‌  (బి) హసరంగ 35; దీపక్‌ చహర్‌ (నాటౌట్‌) 69; భువనేశ్వర్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (49.1 ఓవర్లలో 7 వికెట్లకు) 277. వికెట్ల
పతనం: 1–28, 2–39, 3–65, 4–115, 5–116, 6–160, 7–193. 
బౌలింగ్‌: రజిత 7.1–0–53–1, చమీర 10–0–65–0, హసరంగ 10–0–37–3, సందకన్‌ 10–0–71–1, కరుణరత్నే 6–1–26–0, షనక 3–0–10–1, ధనంజయ 3–0–10–0.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

మరిన్ని వార్తలు