శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లకు ఛాన్స్‌.. ఎవరిపై వేటు..?

11 Jan, 2023 21:04 IST|Sakshi

IND VS SL 2nd ODI: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య కోల్‌కతా వేదికగా రేపు (జనవరి 12) రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ సాధించిన భారత్‌.. రేపటి మ్యాచ్‌ కోసం ఎలాంటి మార్పులు చేయబోతుందోనని క్రికెట్‌ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్‌లో ప్రదర్శనల ఆధారంగా చూస్తే రేపటి మ్యాచ్‌లో ఎవరినీ తప్పించే అవకాశం లేనప్పటికీ.. సూర్యకుమార్‌ యాదవ్‌ (లంకతో మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు), ఇషాన్‌ కిషన్‌ (బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డేలో డబుల్‌ సెంచరీ బాదాడు) లతో రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉంది కాబట్టి, రొటేషన్‌ పద్దతిలో వీరిద్దరికి ఛాన్స్‌ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకవేళ వీరిద్దరికి అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేస్తారన్నది ప్రస్తుతం మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కోహ్లి (113), రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) పరుగుల వరద పారించారు కాబట్టి వీరిని కదిలించే అవకాశం లేదు. బ్యాటింగ్‌ విభాగంలో ఇక మిగిలింది శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌లు మాత్రమే. గత మ్యాచ్‌లో వీరిద్దరు కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. శ్రేయస్‌ 28, రాహుల్‌ 39 పరగులు చేసి ఔట్‌ కావడంతో అందరి కళ్లు వీరిద్దరిపై పడ్డాయి.

స్కై, ఇషాన్‌లకు ఛాన్స్‌ ఇవ్వాలంటే వీరిని తప్పించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇషాన్‌ ఎటూ వికెట్‌కీపింగ్‌ చేస్తాడు కాబట్టి రాహుల్‌ స్థానాన్ని భర్తీ చేస్తాడని, శ్రేయస్‌ స్థానాన్ని సూర్యకుమార్‌తో ఫిల్‌ చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లో పరుగులు చేయనంత మాత్రానా, జట్టును నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు.

తొలి వన్డేలో శ్రేయస్‌, రాహుల్‌ బరిలోకి దిగిన సమయానికి ధాటిగా పరుగులు చేయాల్సి ఉండింది, ఆ క్రమంలోనే వారు ఔటయ్యారు, అలాంటప్పుడు వారిని జట్టు నుంచి తప్పించాలనడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఇలా వాదించే వారికి స్కై, ఇషాన్‌ అభిమానులు కూడా తగు రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇషాన్‌ తాను ఆడిన ఆఖరి వన్డేలో డబుల్‌ సెంచరీ, స్కై.. తానాడిన చివరి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు సమతూకం పేరు చెప్పి వీరిని తప్పించలేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్‌మీడియాలో ఈ ఆసక్తికర చర్చ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌ కోసం జట్టు మేనేజ్‌మెంట్‌ ఎలాంటి మార్పులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  


 

మరిన్ని వార్తలు