IND VS SL 2nd T20: సుడిగాలి ఇన్నింగ్స్‌తో రికార్డులు కొల్లగొట్టిన అక్షర్‌

6 Jan, 2023 08:35 IST|Sakshi

Axar Patel: పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. లంక నిర్ధేశించిన 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

కాగా, ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన అక్షర్‌ పటేల్‌ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఓటమి ఖాయం అనుకున్న దశలో బరిలో దిగిన ఈ గుజరాత్‌ ఆల్‌రౌండర్‌.. పోరాడితే పోయేదేమీ లేదన్న రీతిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడి, వారి చేత కూడా శభాష్‌ అనిపించుకున్నాడు.

సూర్యకుమార్‌ అండతో పేట్రేగిపోయిన అక్షర్‌ కేవలం 20 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్ధి వెన్నులో వణుకు పుట్టించాడు. కెరీర్‌లోనే బెస్ట్‌ ఇన్నింగ్స్‌ ఆడిన అక్షర్‌ జట్టును గెలిపించలేనప్పటికీ విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.

ఈ క్రమంలో అక్షర్‌ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు (65) చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు రవీంద్ర జడేజా (44 నాటౌట్‌) పేరిట ఉండేది. 

అలాగే ఈ మ్యాచ్‌లో అక్షర్‌ బాదిన అర్ధసెంచరీ టీమిండియా తరఫున ఐదో అత్యంత వేగవంతమైన హాఫ్‌ సెంచరీగా (20 బంతుల్లో) రికార్డుల్లోకెక్కింది.


 
దీంతో పాటు భారత్‌ తరఫున ఏడు అంతకంటే తక్కువ స్థానాల్లో బరిలోకి దిగి అత్యధిక సిక్సర్లు (6) బాదిన రికార్డును కూడా అక్షర్‌ తన ఖాతాలోనే వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు దినేశ్‌ కార్తీక్‌ పేరిట ఉండేది. డీకే ఏడో స్థానంలో బరిలోకి దిగి 4 సిక్సర్లు బాదాడు. 

మరిన్ని వార్తలు