Rahul Tripathi: వైరల్‌.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్‌!

6 Jan, 2023 14:21 IST|Sakshi
టీమిండియా (PC: BCCI)

India vs Sri Lanka, 2nd T20I - Rahul Tripathi: అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాలన్న భారత బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి కల 31 ఏళ్ల వయసులో నెరవేరింది. స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌... గురువారం నాటి రెండో మ్యాచ్‌ సందర్భంగా అరంగేట్రం చేశాడు. 

గత కొన్నాళ్లుగా వివిధ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ పుణె వేదికగా లంకతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో అతడు చోటు దక్కించుకోగలిగాడు. సంజూ శాంసన్‌ మోకాలి గాయంతో దూరం కావడంతో త్రిపాఠి అరంగేట్రానికి లైన్‌ క్లియర్‌ అయింది.

విఫలమైన త్రిపాఠి
అయితే, ఈ మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో మైదానంలో దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన వేళ వన్‌డౌన్‌ బ్యాటర్‌గా త్రిపాఠి ఎంట్రీ ఇచ్చాడు. ఎదుర్కొన్న రెండో బంతినే ఫోర్‌గా మలిచిన అతడు.. ఆ తర్వాత ఒక్క పరుగు మాత్రమే తీసి పెవిలియన్‌ చేరాడు. 

దిల్షాన్‌ మధుషంక బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌కు సులువైన క్యాచ్‌ ఇచ్చి 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ అతడి ఫ్యాన్స్‌ ఉసూరుమంటున్నారు.

అద్భుత క్యాచ్‌
ఇదిలా ఉంటే.. అరంగేట్ర మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి అందుకున్న క్యాచ్‌  మ్యాచ్‌ హైలైట్స్‌లో ఒకటిగా నిలిచింది. లంక ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ వేసిన టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌.. ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంకకు షార్ట్‌బాల్‌ సంధించాడు.

ఈ బంతిని ఎదుర్కొన్న నిసాంక డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా షాట్‌ బాదాడు. దీంతో అక్కడే ఉన్న త్రిపాఠి అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో బ్యాలెన్స్‌ కోల్పోయి అతడు కిందపడటంతో కాస్త గందరగోళం నెలకొంది. 

నిశిత పరిశీలన తర్వాత ఎట్టకేలకు థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం భారత్‌కు అనుకూలంగా రావడంతో నిసాంక నిరాశగా వెనుదిరిగాడు. అయితే, క్యాచ్‌ పట్టిన తర్వాత త్రిపాఠి చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంతిని చేతిలో పట్టుకుని.. సిక్సర్‌ సిగ్నల్‌ చూపిస్తూ అతడు సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

అవుటా? సిక్సరా? ఏంటిది?
దీంతో కాస్త తికమకపడ్డ బౌలర్‌ అక్షర్‌.. త్రిపాఠిని అనుకరిస్తూ.. ‘సిక్స్‌ అంటున్నాడేంటి’’ అన్నట్లుగా నవ్వుతూ సహచరులకు సైగ చేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘హే రాహుల్‌.. భయపెట్టావు.

అసలే అది అవుటో కాదో అని కంగారు పడుతుంటే.. నువ్వేమో సిక్సర్‌ అన్నావు. ఏదేమైనా తొలి మ్యాచ్‌లో మంచి క్యాచ్‌ అందుకున్నావు’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో భాంగ్రా స్టెప్‌తో త్రిపాఠి సెలబ్రేట్‌ చేసుకుంటూ ఇటు బౌలర్‌.. అటు అంపైర్‌ను కన్ఫ్యూజ్‌ చేశాడని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఓడిన టీమిండియా 1-1తో సిరీస్‌ సమం కావడంతో మూడో టీ20లో చావోరేవో తేల్చుకోవాల్సి ఉంది. కాగా రెండో టీ20లో 2 వికెట్లు తీయడం సమా 65 పరుగులతో అక్షర్‌ పటేల్‌ అద్భుత ప్రదర్శన చేశాడు.

చదవండి: Ind Vs SL: చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలు; ‘నెట్స్‌లో నేను సిక్స్‌లు బాదడం చూసే ఉంటారు!’
IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్‌

మరిన్ని వార్తలు