శ్రీలం‍కతో రెండో టీ20.. టీమిండియాలో జరుగబోయే మార్పులు ఏవంటే..?

4 Jan, 2023 20:45 IST|Sakshi

IND VS SL 2nd T20: పూణే వేదికగా రేపు (జనవరి 5) శ్రీలంకతో జరుగబోయే రెండో టీ20లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగే ఆస్కారం ​ఉన్నట్లు తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ గాయపడ్డాడని, అతని స్థానంలో రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ పేర్కొంది.

ఓపెనింగ్‌ బెర్తులకు అవకాశం లేకపోవడంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ పేరును పరిశీలించరని, అందుకే రాహుల్‌ త్రిపాఠిని ప్రయోగించే ఛాన్స్‌ ఉంటుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (7) విఫలమైనప్పటికీ.. అతడిని తొలిగించే అవకాశం లేదు. గత కొంతకాలంగా గిల్‌ ప్రదర్శన నేపథ్యంలో ఒక్క మ్యాచ్‌కే అతడిని పక్కకు పెట్టే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. 

మరోవైపు బౌలింగ్‌ విభాగంలోనూ రెండు మార్పులు ఆస్కారం​ ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తొలి టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న హర్షల్‌ పటేల్‌ స్థానంలో జ్వరం నుంచి కోలుకున్న అర్షదీప్‌ సిం‍గ్‌కు ఛాన్స్‌ ఇచ్చే ఆస్కారం ఉందని తెలుస్తోంది.

అలాగే తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 26 పరుగులు సమర్పించుకున్న స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ చహల్‌ స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. పై పేర్కొన్న ఒక్క మార్పుతో (సంజూ స్థానంలో త్రిపాఠి) పాటు ఈ రెండు మార్పులు మినహా టీమిండియా మరో మార్పు చేసేందుకు సాహసించకపోవచ్చు. ప్రస్తుత భారత జట్టులో రాహుల్‌ త్రిపాఠి, అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌ మాత్రమే బెంచ్‌పై ఉన్నారు. 

ఇదిలా ఉంటే, లంకతో జరిగిన తొలి టీ20లో టీమిం‍డియా బ్యాటింగ్‌లో కాస్త తడబడినా బౌలింగ్‌లో పర్వాలేదనిపించి. అరంగేట్ర కుర్రాడు శివమ్‌ మావి (4/22), కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ (2/27) చెలరేగగా, హర్షల్‌ పటేల్‌ (2/41) ఓకే అనిపించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దీపక్‌ హుడా (41 నాటౌట్‌, ఆఖరి ఓవర్‌లో రెండు రనౌట్లు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు.

బ్యాట్‌తో పర్వాలేదనిపించిన (31 నాటౌట్‌) అక్షర్‌ పటేల్‌.. కీలక సమయంలో (ఆఖరి ఓవర్‌) బంతినందుకుని ఓకే అనిపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. ఇషాన్‌ కిషన్‌ (37), హార్ధిక్‌ (29), దీపక్‌ హుడా (41 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (31 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసిం‍ది. ఛేదనలో తడబడిన శ్రీలంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటై, 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.  
 

మరిన్ని వార్తలు