లంకతో రెండో టీ20.. సంజూ శాంసన్‌ ఔట్‌..?

4 Jan, 2023 19:23 IST|Sakshi

IND VS SL 2nd T20: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య పూణే వేదికగా రేపు (జనవరి 5) జరుగబోయే రెండో టీ20 నుంచి వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ ఔటయ్యాడని తెలుస్తోంది. వాంఖడేలో జరిగిన తొలి మ్యాచ్‌ సందర్భంగా సంజూ మోకాలికి గాయమైందని, వైద్యుల సలహా తీసుకునే నిమిత్తం అతను జట్టుతో పాటు పూణేకు కూడా రాలేదని ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. స్కానింగ్‌ల కోసం సంజూ ప్రస్తుతం (జనవరి 4) ముంబైలోనే ఉన్నట్లు సదరు వెబ్‌సైట్‌ తెలిపింది. తొలి టీ20 సందర్భంగా ఓ క్యాచ్‌ కోసం విఫలయత్నం చేసి సంజూ గాయపడ్డాడని, ఆ తర్వాత అతను మ్యాచ్‌లో కొనసాగినప్పటికీ మోకాలి భాగంలో వాపు ఉందని తెలుస్తోంది. 

కాగా, లంకతో జరిగిన తొలి టీ20లో సంజూ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ దారుణంగా నిరాశపర్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని ఈ కేరళ బ్యాటర్‌.. ఫీల్డింగ్‌లోనూ క్యాచ్‌ను జారవిడిచి విమర్శలెదుర్కొన్నాడు. భారత దిగ్గజ ఆటగాడు, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌.. శాంసన్‌ చెత్త షాట్‌ సెలెక్షన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అమవాస్యకో పున్నానికో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోకుంటే ఎలా అంటూ ఘాటు స్వరంతో వ్యాఖ్యానించాడు. 

తొలి టీ20లో టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడి (5 పరుగులు) దారుణంగా నిరాశపరిచాడు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్ నాలుగో బంతికి క్యాచ్ మిస్ కావడంతో బతికిపోయిన సంజూ.. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేక అదే ఓవర్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన సంజూ.. ఫీల్డింగ్ చేస్తూ కీలక క్యాచ్ జారవిడిచాడు. లంక ఇన్నింగ్స్‌లో హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌లో నిస్సంక ఇచ్చిన క్యాచ్‌ను వదిలిపెట్టి కెప్టెన్‌ ఆగ్రహానికి గురయ్యాడు.  
 

మరిన్ని వార్తలు