Ind Vs SL: చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలు; ‘నెట్స్‌లో నేను సిక్స్‌లు బాదడం చూసే ఉంటారు!’

6 Jan, 2023 12:34 IST|Sakshi
టీమిండియా (PC: BCCI)

India vs Sri Lanka, 2nd T20I: శివం మావి... శ్రీలంకతో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఈ యువ పేసర్‌ అరంగేట్రంలోనే 4 వికెట్లతో చెలరేగాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు. కానీ... ఆ తర్వాతి మ్యాచ్‌లోనే సీన్‌ రివర్స్‌ అయింది. 

లంకతో పుణె వేదికగా జరిగిన రెండో టీ20లో మావి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన అతడు ఏకంగా 53 పరుగులు ఇచ్చాడు. 

అయితే, అదే సమయంలో తన బ్యాటింగ్‌ స్కిల్స్‌తో ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేయడం విశేషం. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ.. అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే.

బ్యాటింగ్‌లో మెరుపులు
అర్ధ శతకం పూర్తి చేసుకున్న సూర్య అవుట్‌ కావడంతో క్రీజులోకి శివం మావి వచ్చాడు. అప్పటికే జోరు మీదున్న అక్షర్‌కు స్ట్రైక్‌ రొటేట్‌ చేసి నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉండిపోతాడేమో అనుకుంటున్న తరుణంలో లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు.


హుడా, మావి, చహల్‌

15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు. మధుషంక బౌలింగ్‌లో 18వ ఓవర్‌లో ఆఖరి మూడు బంతుల్లో వరుసగా సిక్స్‌, ఫోర్‌, సిక్స్‌తో కదం తొక్కాడు. ఈ నేపథ్యంలో.. శివం మావి మాట్లాడిన మాటలు తాజాగా వైరల్‌ అవుతున్నాయి.

నెట్స్‌లో నేను కొట్టే సిక్స్‌లు చూసే ఉంటారు!
బీసీసీఐ టీవీ గత ఇంటర్వ్యూలో శివం మావి మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లుగా బ్యాటింగ్‌పై దృష్టి సారించాను. నెట్స్‌లో నేను కొట్టే సిక్స్‌లు చూసే ఉంటారు. నా ఫీల్డింగ్‌ బాగుంది. బౌలింగ్‌ కూడా బాగానే చేస్తున్నా. అందుకే బ్యాటింగ్‌పై ఫోకస్‌ చేసి ఇంకాస్త మెరుగుపడితే బాగుంటుందని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.  

కాగా ఐపీఎల్‌ శివం మావి ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మెరుస్తూంటాడన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే..  ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2023 మినీ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ మావిని ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో మావి అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయడం గమనార్హం. ఇక లంకతో రెండో టీ20లో టీమిండియా 16 పరుగులతో ఓడగా సిరీస్‌ 1-1తో సమమైంది.

చదవండి: IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్‌
IND Vs SL 2nd T20: అర్షదీప్‌ సింగ్‌ నో బాల్స్‌ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ గవాస్కర్‌

మరిన్ని వార్తలు