IND Vs SL 2nd T20: అర్షదీప్‌ సింగ్‌ నో బాల్స్‌ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ గవాస్కర్‌

6 Jan, 2023 11:41 IST|Sakshi

క్రికెట్‌కు సంబంధించి ఎంతటి వారు తప్పు చేసినా పరుష పదజాలంతో మందలించే లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గవాస్కర్‌.. తాజాగా టీమిండియా యువ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌పై ఫైరయ్యాడు. శ్రీలంకతో నిన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో అర్షదీప్‌ హ్యాట్రిక్‌ నో బాల్స్‌తో పాటు మొత్తంగా 5 నో బాల్స్‌ వేయడంపై సన్నీ ఓ రేంజ్‌లో మండిపడ్డాడు.

ప్రొఫెషనల్‌ బౌలర్‌ అయి ఉండి ఇలా చేయడం సరికాదని, పరోక్షంగా గల్లీ బౌలర్‌ అని అర్ధం వచ్చేలా సంబోధించాడు. నో బాల్స్‌ వేయకపోవడం అన్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్‌కు ప్రాధమిక సూత్రమని, అది మరిచిన బౌలర్‌ ఈ స్థాయి క్రికెట్‌కు పనికిరాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. బౌలర్‌ తన బేసిక్స్‌కు స్టిక్‌ అయి బంతి విసిరిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాటర్‌ ఏం చేస్తాడన్నది పక్కకు పెడితే.. నోబాల్‌ వేయకపోవడం అన్నది బౌలర్‌ బేసిక్స్‌లో భాగమని అర్షదీప్‌ను ఉద్దేశించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ జరుగుతుండగా లైవ్‌ కామెంట్రీలోనే గవాస్కర్‌ అర్షదీప్‌పై విరుచుకుపడ్డాడు. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ బౌల్‌ చేసిన అర్షదీప్‌ వరుసగా మూడు నోబాల్స్‌ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో బంతినందుకున్న అర్షదీప్‌.. ఆ ఓవర్‌లోనూ మరో రెండు నో బాల్స్‌ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్‌ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు.

ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్‌ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 
 

మరిన్ని వార్తలు