IND VS SL 2nd Test Day 2: ఐదేసిన బుమ్రా.. కుప్పకూలిన శ్రీలంక

13 Mar, 2022 15:46 IST|Sakshi

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (పింక్‌ బాల్‌ టెస్ట్‌) శ్రీలంక జట్టు ఓటమి దిశగా సాగుతుంది. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా (5/24) ఐదేయడంతో లంకేయులు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలారు. ఓవర్ నైట్ స్కోరు 86/6 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. ఇన్నింగ్స్‌ ప్రారంభమైన ఐదంటే ఐదు ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. బుమ్రాకు జతగా అశ్విన్‌ (2/30), షమీ (2/18), అక్షర్‌ (1/21)లు రాణించడంతో లంక తొలి రోజు స్కోర్‌కు మరో 23 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన వికెట్లు కోల్పోయింది.

ఫలితంగా టీమిండియాకు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. కెరీర్‌లో 29వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న బుమ్రా 8వ సారి ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగగా, లంక ఇన్నింగ్స్‌లో ఏంజలో మాథ్యూస్‌ (43), డిక్వెల్లా (21), ధనంజయ డిసిల్వా (10)లు మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే మయాంక్‌ అగర్వాల్‌ (22) వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్‌ నష్టానికి 43 పరుగులు చేసి, ఓవరాల్‌గా 186 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రోహిత్ శర్మ (20), హనుమ విహారి క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక!

మరిన్ని వార్తలు