Ind Vs Sl 2nd Test: శ్రీలంక ‘పేసర్‌’కు ద్రవిడ్‌, కోహ్లి విషెస్‌.. వీడియో

14 Mar, 2022 08:09 IST|Sakshi
శ్రీలంక పేసర్‌కు ద్రవిడ్‌, కోహ్లి విషెస్‌(PC: BCCI)

Ind Vs Sl 2nd Test:- శ్రీలంక పేసర్‌ సురంగ లక్మల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు అతడి కెరీర్‌లో చివరిది. పింక్‌ బాల్‌ టెస్ట్‌ రెండో రోజు ఆటలో భాగంగా లక్మల్‌ చివరి బంతిని వేశాడు. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ఆఖరి బంతిని సంధించాడు.

ఈ క్రమంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అతడి దగ్గరకు వెళ్లి పలకరించారు. నవ్వుతూ కరచాలనం చేస్తూ.. భవిష్యత్తు బాగుండాలంటూ ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా అభిమానులను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా.. శ్రీలంక జట్టు సురంగను గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో గౌరవించింది. 

ఇక 35 ఏళ్ల సురంగ కెరీర్‌ విషయానికొస్తే.. శ్రీలంక తరఫున 70 టెస్టుల్లో 171 వికెట్లు పడగొట్టాడు. నాలుగు సార్లు  5 వికెట్లు ఘనతను సాధించాడు. 86 వన్డేలు ఆడిన అతడు 109 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 11 టీ20 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీశాడు. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే జట్టు నుంచి తప్పుకొంటున్నానని, ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు సురంగ ప్రకటించాడు.

మరిన్ని వార్తలు