IND VS SL 2nd Test: మరో మైలురాయిని అధిగమించిన అశ్విన్‌.. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 8వ బౌలర్‌గా..!

14 Mar, 2022 16:49 IST|Sakshi

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ మరో మైలురాయిని అధిగమించాడు. మూడో రోజు ఆట‌లో లంక బ్యాటర్‌ ధనంజయ డిసిల్వాను ఔట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ టెస్ట్‌ల్లో 440వ వికెట్‌ను పడగొట్టాడు. తద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 8వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ (93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు)ను అధిగమించాడు. ప్రస్తుతం 86 టెస్ట్‌ల్లో 440 వికెట్లతో కొనసాగుతున్న అశ్విన్‌.. ఇదే సిరీస్‌లో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ పేస్‌ దిగ్గజం రిచర్డ్‌ హ్యాడ్లీ (86 టెస్ట్‌ల్లో 431), శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్ (93 టెస్టులలో 433 వికెట్లు), భారత లెజెండరీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్ (‌131 టెస్ట్‌ల్లో 434 వికెట్లు)లను కూడా అధిగమించాడు. 


లంకతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో అశ్విన్‌ ఇప్పటివరకు 10 వికెట్లు (తొలి టెస్ట్‌లో 6, రెండో టెస్ట్‌లో 4) పడగొట్టాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్‌ గ్రేట్‌ స్పిన్నర్‌ దివంగత షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు), జేమ్స్ అండర్సన్ (169 టెస్ట్‌ల్లో 640 వికెట్లు), భారత దిగ్గజ లెగ్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే (132 టెస్ట్‌ల్లో 619 వికెట్లు), ఆసీస్‌ మాజీ పేసర్‌ మెక్‌గ్రాత్‌ (124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లు), ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (152 మ్యాచ్‌ల్లో 537 వికెట్లు), విండీస్‌ మాజీ పేసర్‌ వాల్ష్‌ (132 టెస్ట్‌ల్లో 519 వికెట్లు) వరుసగా రెండు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి అశ్విన్ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

ఇక పింక్‌ బాల్‌ టెస్ట్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. సిరీస్‌లో వరుసగా రెండో విజయానికి 5 వికెట్ల దూరంలో ఉంది. 446 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 180 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కరుణరత్నే (89), చరిత్‌ అసలంక (5) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో లంక విజయం సాధించాలంటే మరో 267 పరుగులు చేయాల్సి ఉంది. 
చదవండి: అశ్విన్‌ ఖాతాలో మరో మైలురాయి.. కపిల్‌ దేవ్‌ రికార్డు బద్దలు


 

మరిన్ని వార్తలు