IND Vs SL 2nd Test: అనుకున్నదే అయ్యింది.. కోహ్లి అభిమానుల గుండె బద్దలైంది

13 Mar, 2022 22:10 IST|Sakshi

Virat Kohli: విరాట్‌ కోహ్లి విషయంలో అతని ఫ్యాన్స్‌ భయమే నిజమైంది. ఇన్నాళ్లు తమ ఆరాధ్య క్రికెటర్‌ బ్యాటింగ్‌ సగటు అన్ని ఫార్మాట్లలో 50కి పైగా ఉందని కాలరెగరేసుకు తిరిగిన టీమిండియా మాజీ కెప్టెన్‌ అభిమానులకు ఇకపై అలా చెప్పుకుని తిరిగే ఛాన్స్‌ లేకుండా పోయింది. బెంగళూరు వేదకగా శ్రీలంకతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 36 పరుగులు (23, 13) మాత్రమే చేయడంతో ఐదేళ్ల తర్వాత తొలిసారి అతని బ్యాటింగ్‌ సగటు 50 దిగువకు పడిపోయింది. 

దీంతో కోహ్లి ఫ్యాన్స్‌ గుండె బద్దలైనంత పనైంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి కనీసం 43 పరుగులు (రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి) చేసి ఉంటే అతని సగటు 50కిపైనే కొనసాగేది. అంతకుముందు 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. ప్రస్తుతం అదే ప్రత్యర్ధితో జరిగిన మ్యాచ్‌లోనే కోహ్లి సగటు మరోసారి 50 దిగువకు (49.95) పడిపోయింది. ప్రస్తుతం కోహ్లి 101 టెస్ట్‌ల్లో 49.55, 260 వన్డేల్లో 58.07, 97 టీ20ల్లో  51.50 సగటుతో కొనసాగుతున్నాడు.

ఇదిలా ఉంటే, బెంగళూరు టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమిండియా లంక ముందు 447 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 28 పరుగులు చేసింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేయగా, శ్రీలంక 109 పరుగులకు ఆలౌటైంది. 
చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతాలో మరో రికార్డు

మరిన్ని వార్తలు