Ind Vs Sl 3rd ODI: 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే!

23 Jul, 2021 16:53 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బ్యాటింగ్‌ కొనసాగుతోంది. కెప్టెన్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 13 పరుగులకే అవుట్‌ కాగా.. మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్‌ పృథ్వీ షా(49), సంజూ శాంసన్‌(46) పెవిలియన్‌ చేరారు. ప్రస్తుతం  మనీశ్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో ఉండగా వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగా.. సంజూ శాంసన్‌, గౌతం, రాహుల్‌ చహర్‌, నితీశ్‌ రాణా, చేతన్‌ సకారియా తదితర భారత క్రికెటర్లు ఈ మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఒకేసారి ఐదుగురు టీమిండియా ప్లేయర్లు వన్డే క్యాపులు అందుకోవడం 1980 తర్వాత ఇదే తొలిసారి.

గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా... అప్పటి ఆటగాళ్లు దిలీప్‌ దోషి, కీర్తి ఆజాద్‌, రోజర్‌ బిన్నీ, సందీప్‌ పాటిల్‌, తిరుమలై శ్రీనివాసన్‌ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ... ‘‘సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత టీమిండియా ఇలాంటి సాహసానికి పూనుకుంది. ఒకే మ్యాచ్‌లో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలికింది. నామమాత్రపు మ్యాచ్‌ అయినా సరే, యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించింది. ఆల్‌ ది బెస్ట్‌ అందరికీ’’ అంటూ అభిమానులు అరంగేట్ర ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు.

ఇక మహిళల క్రికెట్‌ విషయానికొస్తే... గత నెలలో ఇంగ్లండ్‌ టూర్‌లో భాగంగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్‌, షఫాలీ వర్మ, తాన్యా భాటియా, స్నేహా రానా భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశారు. కాగా  శిఖర్‌ ధావన్‌ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరిదైన మూడో వన్డేలో భారీ మార్పులతో బరిలోకి దిగింది.  

టీమిండియా ప్రస్తుత స్కోరు- 147/3 (23)

మరిన్ని వార్తలు