Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే!

16 Jan, 2023 10:49 IST|Sakshi
విరాట్‌ కోహ్లి (PC: BCCI)

India vs Sri Lanka, 3rd ODI- Virat Kohli: ‘‘నాకసలు ఈ రికార్డుల గురించి ఐడియా లేదు. ఆటను ఆస్వాదిస్తూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడటమే నా పని. టీమ్‌ను గెలిపించాలనే మైండ్‌సెట్‌తోనే బ్యాటింగ్‌ చేస్తాను. నా ఆటకు అదనంగా వచ్చేవే ఈ రికార్డులు.  కుదిరన్నన్నాళ్లు ఆడుతూనే ఉంటాను.

సుదీర్ఘ విరామం తర్వాత జట్టులో పునరగామనం చేసినప్పటి నుంచి నూతనోత్సాహంతో ముందుకు సాగుతున్నా. మైలురాళ్లను చేరుకోవాలని తహతహలాడే తత్వం కాదు నాది. రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు. కేవలం ఆటను ఆస్వాదించమే నాకు తెలుసు. ప్రస్తుతం నేను కాస్త రిలాక్స్‌ అవ్వగలుగుతున్నాను. ఈ ఫామ్‌ను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు.

ఆగని రన్‌ మెషీన్‌
శ్రీలంకతో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో రెండు సెంచరీలు నమోదైన విషయం తెలిసిందే. యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 116 పరుగులు చేయగా.. కోహ్లి 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా వన్డే కెరీర్‌లో 46వ శతకం, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు.

ఈ క్రమంలో ఎన్నో అరుదైన ఘనతలు తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్‌ కోహ్లి. అదే విధంగా లంకతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో రెండు శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. తన సంతోషాన్ని పంచుకున్నాడు.

సచిన్‌ రికార్డుకు చేరువలో 
రికార్డుల కన్నా జట్టు ప్రయోజనాల గురించే ఎక్కువగా ఆలోచిస్తానని రికార్డుల రారాజు కోహ్లి మరోసారి స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి మరో 3 సెంచరీలు బాదితే వన్డేల్లో సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలవుతుంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇక తిరువనంతపురంలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొంది శ్రీలంకతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకు ముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 

చదవండి: IND vs SL: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్‌.. విరాట్‌ ఏం చేశాడంటే?
IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

మరిన్ని వార్తలు