IND Vs SL: లంక క్రికెట్‌లో సంక్షోభం.. రిటైర్మెంట్ యోచనలో స్టార్ క్రికెట‌ర్‌

7 Jul, 2021 17:07 IST|Sakshi

కొలంబో: ఒక‌ప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాశించిన శ్రీలంక క్రికెట్‌ జటు,​ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ద‌శాబ్ద కాలం కింద‌టితో పోలిస్తే ఇప్పుడు జట్టు పూర్తి బ‌ల‌హీనంగా మార‌డం, వ‌రుస ఓట‌ములు, బోర్డుతో క్రికెట‌ర్ల విభేదాలు.. శ్రీలంక క్రికెట్‌ను క‌ష్టాల్లోకి నెట్టాయి. కాంట్రాక్ట్‌పై సంత‌కం చేసేందుకు లంక క్రికెట‌ర్లు నో అంటున్నార‌న్న వార్తల నేప‌థ్యంలో సీనియ‌ర్ ప్లేయ‌ర్ ఏంజలో మాథ్యూస్ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారన్న వార్త సంచలనంగా మారింది.

త్వరలోనే ఈ విష‌యాన్ని అతను శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పే అవ‌కాశ‌మున్నట్లు తెలుస్తోంది. కాగా, వ‌న్డేలు, టీ20ల నుంచి త‌న‌ను త‌ప్పించ‌డంపై మాథ్యూస్ అసంతృప్తితో ఉన్నాడు. యువ ఆట‌గాళ్లకు ఛాన్సిచ్చే పేరుతో లంక సెల‌క్టర్లు అత‌న్ని ప‌క్కన‌పెట్టారు. అయితే దశాబ్ద కాలంగా శ్రీలంక క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న చాలా త‌క్కువ మంది క్రికెటర్లలో మాథ్యూస్ ఒక‌డు.

2017లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత‌ని స‌గ‌టు 63 కాగా, 2018లో 52గా ఉంది. 2019 వన్డే ప్రపంచక‌ప్‌లో లంక జట్టు త‌ర‌ఫున బెస్ట్ బ్యాట్స్‌మ‌న్ కూడా అత‌డే. అయితే తాజాగా లంక బోర్డు కాంట్రాక్ట్‌ను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ప్లేయ‌ర్స్‌కు నాయకత్వం వహించిన మాథ్యూస్‌.. అనూహ్యంగా కాంట్రాక్ట్‌పై సంత‌కం చేయ‌డానికి అంగీక‌రించాడు. 2009లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి వ‌చ్చిన మాథ్యూస్ లంక త‌ర‌ఫున 90 టెస్టులు, 218 వ‌న్డేలు, 78 టీ20లు ఆడాడు. మొత్తం 13,219 ప‌రుగులు, 218 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు