IND VS SL Pink Ball Test: పింక్‌బాల్ టెస్ట్‌పై ఐసీసీ కీలక వ్యాఖ్యలు

20 Mar, 2022 20:06 IST|Sakshi

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఇటీవలే బెంగుళూరులో జరిగిన డే అండ్‌ నైట్ టెస్ట్ (పింక్‌ బాల్‌ టెస్ట్‌)పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్‌ కోసం వినియోగించిన పిచ్‌పై ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ పెదవి విరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పిచ్‌కు బిలో యావరేజ్‌ రేటింగ్‌ ఇచ్చి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చర్యల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంకు ఓ డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం, ఓ వేదిక 5 డీమెరిట్ పాయింట్లు పొందితే, సంవత్సరం పాటు అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా నిషేధిస్తారు. కాగా, రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సొంత మైదానం కావడం విశేషం. ఇదిలా ఉంటే, పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా 3 రోజుల్లోనే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ తొలి రోజు నుంచే విపరీతంగా టర్న్‌ అవుతూ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టింది. తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 16 వికెట్లు పతనమయ్యాయి.

అయితే, భారత బ్యాటర్లు, ముఖ్యంగా శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతమైన బ్యాటింగ్‌ విన్యాసాలతో టీమిండియాకు 238 పరుగుల భారీ విజయాన్నందించాడు. లంక రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కరుణరత్నే సూపర్‌ శతకంతో చెలరేగినప్పటికీ, జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఏకంగా 26 వికెట్లు పడగొట్టగా, టీమిండియా పేసు గుర్రం బుమ్రా నిర్జీవమైన పిచ్‌పై 8 వికెట్లతో (తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు) చెలరేగాడు. 
చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్‌.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు

మరిన్ని వార్తలు