Dasun Shanaka: లంక కెప్టెన్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

30 Jul, 2021 11:25 IST|Sakshi

కొలంబో: టీమిండియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్‌లో లంక కెప్టెన్‌ దాసున్‌ షనక​ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదరగొట్టాడు. నితీష్‌ రాణా ఇచ్చిన క్యాచ్‌ను డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అద్బుతంగా అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ చివరి బంతికి ఇది చోటుచేసుకుంది. షనక వేసిన బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో అతని బ్యాట్‌కు తగిలి షనక​ వైపు వచ్చింది. అయితే షనక వేగంగా పరిగెత్తుకొచ్చి ఒకవైపుగా డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. ఇక షనక తానే బౌలింగ్‌ చేసి.. ఆ తర్వాత క్యాచ్‌ను అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. లంక బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు మాత్రమే చేసింది.. భారత బ్యాటింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ 23 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఏడుగురు బ్యాట్స్‌మెన్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులో ధావన్‌ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఇద్దరు డకౌట్‌గా వెనుదిరగడం విశేషం. లంక బౌలర్‌ వినిందు హసరంగ 4 వికెట్లతో దుమ్మురేపగా.. దాసున్‌ షనక రెండు వికట్లు తీశాడు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యఛేదనలో శ్రీలంక 14.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 82 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (20 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు), హసరంగ (9 బంతుల్లో 14 నాటౌట్‌; 1 ఫోర్‌) జట్టుకు విజయాన్ని కట్టబెట్టారు.

బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన హసరంగ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులను అందుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఎనిమిది వరుస సిరీస్‌ విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు శ్రీలంక రూపంలో బ్రేక్‌ పడింది. శ్రీలంకకు ఐదు వరుస టి20 సిరీస్‌ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్‌ ఇదే కావడం విశేషం. అంతేకాకుండా 2008 తర్వాత భారత్‌పై ద్వైపాక్షిక సిరీస్‌లో విజేతగా నిలువడం శ్రీలంకకు ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు