Shikhar Dhawan: ధావన్‌పై వేటు.. వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ! వరల్డ్‌కప్‌ ఆశలు ఆవిరి! మిస్‌ యూ గబ్బర్‌ అంటూ..

28 Dec, 2022 09:34 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌ (PC: BCCI)

India Vs Sri Lanka 2023- ముంబై: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌ కప్‌తో నిష్క్రమించాలనుకున్న సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆశలు నెరవేరేలా లేవు. శ్రీలంకతో సిరీస్‌ కోసం మంగళవారం ప్రకటించిన వన్డే జట్టులో ధావన్‌కు చోటు దక్కలేదు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 18 పరుగులే చేసిన శిఖర్‌ సెలక్టర్ల భవిష్యత్‌ ప్రణాళికల్లో లేడని స్పష్టమైపోయింది.

ధావన్‌  ఈ నేపథ్యంలో ధావన్‌పై వేటు పడటాన్ని అతడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘‘గత దశాబ్ద కాలంగా శిఖర్‌ ధావన్‌ వన్డే క్రికెట్‌లో ఉత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్‌, కోహ్లితో పాటు తను కూడా ప్రశంసలకు అర్హుడు. 

నిన్ను మిస్‌ అవుతాం
వరల్డ్‌కప్‌ ఆడి కెరీర్‌ ముగించాలనుకున్న తన కలను నెరవేరనివ్వాల్సింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ చిరునవ్వు చెదరనీయక.. అందరిలా బహిరంగంగా అసంతృప్తి ప్రదర్శించకుండా గబ్బర్‌ హుందాగా ప్రవర్తిస్తాడు. కావాల్సినపుడు కెప్టెన్‌ అంటారు.. అందరూ ఉన్నారనుకుంటే తుది జట్టులోనే చోటివ్వరు.

ఏదేమైనా తొడగొడుతూ నువ్వు సెలబ్రేషన్‌ చేసుకునే ఆ దృశ్యాలు ఇక ముందు చూడలేమేమో! భవిష్యత్తులో టీమిండియా జెర్సీలో నిన్ను చూసే అవకాశం లేదని అర్థమవుతోంది. థాంక్యూ గబ్బర్‌.. ఇన్నాళ్లు మాకు వినోదాన్ని పంచావు. భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు చిరస్మరణీయం. నిన్ను మిస్‌ అవుతాం’’అంటూ ఉద్వేగపూరిత కామెంట్లు చేస్తున్నారు.

వాళ్ల నుంచి తీవ్రమైన పోటీ
2019 ప్రపంచకప్‌లో ధావన్‌ సెంచరీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ వరకైనా తనను ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.  కాగా శ్రీలంక  తర్వాత టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతోనూ వన్డే సిరీస్‌లు ఆడనుంది. అయితే, రోహిత్‌ శర్మ- కేఎల్‌ రాహుల్‌ జోడీ రూపంలో ఓపెనర్లు ఉండగా.. యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ సైతం చెలరేగుతున్నాడు. 

ఇటీవలే బంగ్లాతో వన్డే సిరీస్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు ఈ జార్ఖండ్‌ డైనమెట్‌. ఇక మరో యువ ప్లేయర్‌ శుబ్‌మన్‌ గిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో.. వెటరన్‌ ఓపెనర్‌ ధావన్‌కు వీళ్ల నుంచి గట్టి ఎదురవుతోంది. లంకతో సిరీస్‌లో వచ్చిన అవకాశాల్ని వాళ్లు సద్వినియోగం చేసుకుంటే.. ఇక ధావన్‌ను పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. తన కెరీర్‌కు ఎండ్‌ కార్డ్‌ పడే ఛాన్స్‌ లేకపోలేదు.

భువీ అవుట్‌
ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్‌ నేపథ్యంలో మరో సీనియర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను కూడా టి20 జట్టులోంచి తప్పించారు. కాగా జనవరి 3నుంచి 15 మధ్య భారత్, శ్రీలంక మధ్య 3 టి20లు, 3 వన్డేలు జరుగుతాయి. చేతన్‌శర్మ నేతృత్వంలోనే సెలక్షన్‌ కమిటీ ఈ రెండు సిరీస్‌ల కోసం టీమ్‌లను ఎంపిక చేసింది. గాయంనుంచి కోలుకున్న రోహిత్‌ వన్డే కెప్టెన్‌గా బరిలోకి దిగనుండగా...హార్దిక్‌ పాండ్యా టి20 టీమ్‌కు నాయకత్వం వహిస్తాడు.

వన్డే వైస్‌కెప్టెన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేయడం కొత్త నిర్ణయం కాగా, సూర్యకుమార్‌ యాదవ్‌కు టి20 వైస్‌ కెప్టెన్సీ అవకాశం లభించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న రిషభ్‌ పంత్‌ను రెండు టీమ్‌లలో ఎంపిక చేయకపోగా...మొహమ్మద్‌ సిరాజ్‌కు టి20 టీమ్‌లో అవకాశం ఇవ్వలేదు.

షమీ పునరాగమనం
గాయంనుంచి కోలుకున్న షమీ వన్డేల్లో పునరాగమనం చేశాడు. యువ పేసర్లు శివమ్‌ మావి, ముకేశ్‌ కుమార్‌ జట్టులోకి ఎంపికయ్యారు. రోహిత్, విరాట్, శ్రేయస్‌లకు టి20ల నుంచి విశ్రాంతినివ్వగా, పెళ్లి కారణంగా రాహుల్‌ను టి20లకు ఎంపిక చేయలేదు. 

వన్డే జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ (వైస్‌ కెప్టెన్‌), గిల్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్, రాహుల్, ఇషాన్‌ కిషన్, సుందర్, చహల్, కుల్దీప్, అక్షర్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, అర్ష్‌దీప్‌ సింగ్‌
టి20 జట్టు: హార్దిక్‌ (కెప్టెన్‌), సూర్యకుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్, గిల్, హుడా, రాహుల్‌ త్రిపాఠి, సంజు సామ్సన్, సుందర్, చహల్, అక్షర్, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్, ఉమ్రాన్, మావి, ముకేశ్‌ కుమార్‌.    

మరిన్ని వార్తలు