IND Vs SL: క్రీజులోకి వచ్చాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే

29 Jul, 2021 11:34 IST|Sakshi

కొలంబో: టీమిండియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బౌలర్‌ వనిందు హసరంగ ఒక అద్భుతమైన త్రోతో మెరిశాడు. భారత ఇన్నింగ్స్‌ సమయంలో హసరంగ కనీసం వెనక్కి కూడా తిరగకుండా బంతిని వికెట్ల మీదకు విసిరేయడం.. బంతి నేరుగా వెళ్లి వికెట్లు గిరాటేయడం జరిగిపోయింది. అయితే అప్పటికే భారత బ్యాట్స్‌మన్‌ క్రీజులోకి వచ్చేయడంతో రనౌట్‌ అయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హసరంగ చేసిన ఈ ఫీట్‌ను భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చాలాసార్లు ప్రయోగించాడు.. అందులో కొన్నిసార్లు సక్సెస్‌ కాగా.. మరికొన్నిసార్లు విఫలమయ్యాడు.

ఇక విషయంలోకి వెళితే.. భారత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో హసరంగ వేసిన 18వ ఓవర్‌ రెండో బంతిని భువనేశ్వర్‌ కుమార్‌ మిడాన్‌ దిశగా షాట్‌ ఆడాడు. భువీ రెండో పరుగుకు పిలుపునివ్వడంతో నితీష్‌ రాణా పరిగెత్తాడు. ఇంతలో పీల్డర్‌ విసిరిన బంతిని అందుకున్న హసరంగ వెనుకవైపు నుంచే బంతిని వికెట్లకు గిరాటేశాడు. అప్పటికే నితీష్‌ రాణా క్రీజులోకి వచ్చేశాడు. '' క్రీజులోకి వచ్చేశాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే హసరంగ అద్భుత త్రోకు రాణా పెవిలియన్‌ చేరేవాడే'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. 

మ్యాచ్‌ విషయానికి వస్తే...  తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు), తొలి మ్యాచ్‌ ఆడిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌ (18 బంతుల్లో 21; 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్‌; 1 సిక్స్‌) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1–1తో సమమైంది. నేడే సిరీస్‌ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది.

మరిన్ని వార్తలు