Suryakumar Yadav: సూర్య కెరీర్‌పై గంభీర్‌ ట్వీట్‌! నీకు అతడు మాత్రమే కనిపిస్తున్నాడా? ఫ్యాన్స్‌ ఫైర్‌

9 Jan, 2023 12:04 IST|Sakshi

Suryakumar Yadav- Gautam Gambhir Tweet: టీ20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మైదానం నలువైపులా తనదైన షాట్లతో విరుచుకుపడే ఈ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌ను..  పలువురు విశ్లేషకులు.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తూ కొనియాడుతున్నారు. కాగా గతేడాది పొట్టి ఫార్మాట్‌లో అదరగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందిన సూర్య.. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్‌లోనూ దుమ్ములేపాడు.

దుమ్ములేపాడు
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో నిరాశపరిచినా(7).. పుణెలో అర్ధ శతకం(51), రాజ్‌కోట్‌లో అద్భుత సెంచరీ బాదాడు. ముఖ్యంగా సిరీస్‌ విజేతను తేల్చే మూడో టీ20లో సూర్య ప్రదర్శన అత్యద్భుతం. 51 బంతుల్లోనే 112 పరుగులు పూర్తి చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.

తద్వారా టీమిండియా 228 పరుగుల భారీ స్కోరు చేసి.. సిరీస్‌ గెలుపొందడంలో ఈ వైస్‌ కెప్టెన్‌ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని ప్రశంసిస్తూ టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ ట్వీట్‌ చేశాడు.

టెస్టు క్రికెట్‌ ఆడించే సమయం
‘‘అద్భుత ఇన్నింగ్స్‌ సూర్య! ఇతడిని టెస్టు క్రికెట్‌ ఆడించే సమయం ఆసన్నమైంది’’ అని గౌతీ అభిప్రాయపడ్డాడు. ఈ ముంబై బ్యాటర్‌ను టెస్టుల్లో అరంగేట్రం చేయించాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు.

నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్‌
అయితే, గౌతీ అభిమానులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అది కూడా టీ20లో సూర్య ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను గొప్ప టీ20 ప్లేయర్‌ అనడంలో సందేహం లేదు.

కానీ.. నీ నుంచి ఇది ఊహించలేదు భాయ్‌! తనను ఇప్పుడే టెస్టుల్లోకి ఎందుకు తీసుకోవాలి? రంజీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న వాళ్లు నీకు కనబడటం లేదా? ఉదాహరణకు.. సర్ఫరాజ్‌ ఖాన్‌ పేరునే తీసుకో భాయ్‌.. 

తను నిలకడగా ఆడుతూ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిజానికి అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రానికి సూర్య కంటే తనే ఎక్కువ అర్హుడు. కేవలం రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో ప్రతిభ ఆధారంగా టెస్టుల్లో ఛాన్స్‌ ఇవ్వాలనడం సరైంది కాదు. వన్డే, టెస్టుల్లో ప్రస్తుతం అతడు వద్దే వద్దు. హనుమ విహారి లాంటి వాళ్లు కూడా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు’’ అని ఓ నెటిజన్‌ గంభీర్‌కు బదులిస్తూ ట్వీట్‌ చేశాడు.

మరికొంత మంది కూడా అతడికి మద్దతుగా నిలవడం విశేషం. కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌ గత కొంతకాలంగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022- 23 టోర్నీలో ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. మరోవైపు.. సూర్య సైతం లంకతో సిరీస్‌ ఆరంభానికి ముందు సర్ఫరాజ్‌తో ముంబై తరఫున మైదానంలో దిగిన విషయం తెలిసిందే. 
చదవండి: Babar Azam: పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు ఘోర అవమానం
Suryakumar Yadav: సూర్య ఇండియన్‌ కాబట్టి సరిపోయింది.. అదే పాకిస్తాన్‌లో ఉంటేనా: పాక్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు