IND VS SL 2nd Test: సెల్ఫీ కోసం మైదానంలోకి చొచ్చుకొచ్చిన కోహ్లి అభిమానుల అరెస్ట్‌

14 Mar, 2022 17:52 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీ దిగేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చిన నలుగురు యువకులు కటకటపాలయ్యారు. భద్రతా నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురిలో ముగ్గురు బెంగళూరు వాసులు కాగా, ఒకరు కల్బుర్గి ప్రాంతానికి చెందిన కుర్రాడు. బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌ రెండో రోజు ఆటలో ఈ నలుగురు కుర్రాళ్లు సెక్యురిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు కోహ్లితో సెల్ఫీలు దిగగా.. మరో ఇద్దరిని సెక్యూరిటీ సిబ్బంది లాక్కెళ్లారు. 


కాగా, లంకతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా విజయపు అంచుల్లో నిలిచింది. టీమిండియా నిర్ధేశించిన 447 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆట ప్రారంభం నుండే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి, వరుసగా రెండో టెస్ట్‌లో ఓటమికి సిద్ధమైంది. కరుణరత్నే(107) శతకంతో ఒంటరిపోరాటం చేయగా, మిగిలిన వారంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. లంక ఇన్నింగ్స్‌లో కరుణరత్నే, కుశాల్‌ మెండిస్‌ (54), డిక్వెల్లా (12) మినహా మిగతా ఆటగాళ్లెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్‌ కూడా చేయలేకపోయారు. 

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)

భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్‌ ( శ్రేయస్‌ అయ్యర్‌ 67, జయవిక్రమ 4/78)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: 208/9 (కరుణరత్నే 107, బుమ్రా 3/23)
చదవండి: Ind VS Sl 2nd Test: అతడంటే ‘పిచ్చి’.. మైదానంలోకి దూసుకువచ్చి పోలీసులనే..

మరిన్ని వార్తలు