Ind Vs SL 2023: ఇది కల కాదు కదా! నాన్న మెసేజ్‌ చూసి.. ఒక్క క్షణం కళ్లు మూసుకున్నా..

29 Dec, 2022 11:56 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యాతో సూర్య కుమార్‌ (ఫైల్‌ ఫొటో)

India Vs Sri Lanka 2023- T20 Series- Suryakumar Yadav: ‘‘అస్సలు ఊహించలేదు. మెసేజ్‌ చూడగానే.. ఒక్క క్షణం కళ్లు మూసుకున్నా! ఇది కలైతే కాదు కదా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఏదేమైనా అదో గొప్ప అనుభూతి. ఈ ఫీలింగ్‌ను మాటల్లో వర్ణించలేను’’ అంటూ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. 

రంజీ ట్రోఫీతో బిజీగా ఉన్న సూర్య
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1గా నిలిచి సత్తా చాటిన ఈ ముంబై బ్యాటర్‌.. శ్రీలంకతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా టీ20 జట్టుకు సారథ్యం వహించనున్నాడు. 

ఇక సెలవు పెట్టిన కారణంగా కేఎల్‌ రాహుల్‌ జట్టుకు దూరమయ్యాడన్న వార్తల నేపథ్యంలో.. సూర్యకి వైస్‌ కెప్టెన్‌గా ప్రమోషన్‌ లభించడం గమనార్హం. ఈ క్రమంలో హార్దిక్‌కు అతడు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే.. టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించిన సూర్య ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2022- 23లో భాగంగా ముంబై తరఫున ఆడుతున్నాడు.

అస్సలు ఊహించలేదు!
ఈ క్రమంలో సౌరాష్ట్రతో మ్యాచ్‌లో బుధవారం రెండో రోజు ఆట ముగిసిన తర్వాత సూర్య విలేకరులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా లంకతో టీ20 సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘నేనిది అస్సలు ఊహించలేదు.

కల కాదు కదా!
మా నాన్న సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. లంక సిరీస్‌ లిస్టు చూడగానే ఆయన నాకు మెసేజ్‌ పంపారు. ఒత్తిడి వద్దు.. ప్రస్తుతం బ్యాటింగ్‌ చేస్తూ ఉంటావు కదా! దానిని ఆస్వాదించు అని చెప్పారు. 

నేనైతే కలగనడం లేదు కదా అని ఒక్కసారి గిల్లి చూసుకున్నా! ఈ ఏడాది నా ప్రదర్శనకు దక్కిన ప్రతిఫలంగా భావిస్తున్నా. కొత్త హోదాలో మైదానంలో దిగేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఒత్తిడిని అధిగమించి ఆటను పూర్తిగా ఆస్వాదించడమే నాకు తెలుసు’’  అని సూర్య చెప్పుకొచ్చాడు. కాగా జనవరి 3 నుంచి టీమిండియా- శ్రీలంక మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. 

చదవండి: మరోసారి దుమ్మురేపిన సూర్య.. కీలక ఇన్నింగ్స్‌.. టెస్టులో ఎంట్రీ ఖాయం!

మరిన్ని వార్తలు