IND Vs SL: అలా చేస్తానని సవాల్‌ చేశాడు.. అన్నంత పనీ చేశాడు

19 Jul, 2021 17:41 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా నయా సెన్సేషన్‌ ఇషాన్‌ కిషన్‌ అర్ధశతకంతో(42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ద్వారా వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ 23 ఏళ్ల ఝార్ఖండ్‌ కుర్రాడు.. తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్‌గా మలిచి అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదుతానని మ్యాచ్‌కు ముందు సహచరులకు సవాల్‌ విసిరానని, బంతి ఎక్కడ పడినా.. ఖచ్చితంగా మైదానం దాటిస్తానని చెప్పిమరీ బరిలోకి దిగానని చహ‌ల్‌తో చేసిన చిట్‌చాట్‌ సందర్భంగా ఇషాన్‌ స్వయంగా వెల్లడించాడు.

చెప్పినట్టుగానే తాను ఎదుర్కొన్న తొలి బంతిని మైదానం బయటకు పంపిన ఇషాన్‌.. రెండో బంతిని సైతం బౌండరీకి తరలించాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడిన అతను.. చివరకు సందకన్‌ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, అరంగేట్రం వన్డేలో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్‌ .. టీ20 అరంగేట్రంలోనూ అర్ధశతకాన్ని బాదాడు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్‌ పొట్టి ఫార్మాట్‌లోకి అడుగుపెట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ (32 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగి టీమిండియా విజయంలో కీలపాత్ర పోషించాడు.

అలాగే ఆడిన తొలి టీ20లోనే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. మరోవైపు నిన్నటి మ్యాచ్‌లో సైతం అద్భుతమై అర్ధసెంచరీతో రాణించిన ఇషాన్‌.. భారత విజయంలో తన వంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ముకుమ్మడిగా రాణించడంతో ఆతిధ్య శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇదే వేదికగా రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది.

మరిన్ని వార్తలు