WC 2023: వాళ్లిద్దరికి ఛాన్స్‌లు ఇవ్వాలి! ఇషాన్‌ ట్రిపుల్‌ సెంచరీ చేసేవాడేమో! పాపం..

10 Jan, 2023 15:46 IST|Sakshi
ఇషాన్‌ కిషన్‌

India vs Sri Lanka, 1st ODI: టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు శ్రీలంకతో తొలి వన్డేలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్‌ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీ20 సిరీస్‌లో సత్తా చాటిన సూర్యకు వన్డేలోనూ అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తనకు నచ్చలేదన్నా‍డు.

గువహటి వేదికగా టీమిండియా- శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌ మంగళవారం ఆరంభమైంది. ఈ క్రమంలో టీ20 సిరీస్‌లో ఆడిన.. యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌, శతక వీరుడు సూర్య కుమార్‌ యాదవ్‌ సహా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కు మొదటి వన్డేలో చోటు దక్కలేదు.

మ్యాచ్‌ ఫలితం మార్చగలరు!
ఈ నేపథ్యంలో సిరీస్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భారత మాజీ కెప్టెన్‌ శ్రీకాంత్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. సొంతగడ్డపై ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీ జరుగనున్న తరుణంలో సూర్య, ఇషాన్‌ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. 

ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా వీరికి ఉందని.. ఈ ఇద్దరికి జట్టులో స్థానం కోసం మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘వన్డే క్రికెట్‌లో ఆది నుంచే ప్రభావం చూపగల బ్యాటర్లు కావాలి. 

సారీ సూర్య!
సూర్య ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్‌ను ఎప్పుడైనా ఎలాగైనా మలుపు తిప్పగలడు. శ్రేయస్‌ అయ్యర్‌ వన్డేల్లో నిలకడగా ఆడగలడని నిరూపించుకున్న వాడే. కానీ.. సూర్య వన్డే ఫార్మాట్‌లో తనను తాను నిరూపించుకోవాలంటే అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అతడు తుది జట్టులో ఉంటే అద్భుతాలు చేయగలడు. 

సూర్య విషయంలో నాకు చాలా బాదేసింది. మై డియర్‌ సూర్య నీకు తుది జట్టులో చోటు దక్కలేదు. సారీ!’ ఇక ఇషాన్‌ కిషన్‌.. ఈ మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ చేసేవాడేమో! కానీ దురదృష్టం అతడిని వెంటాడింది’’ అని చిక్కా అన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్‌ డబుల్‌ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

గిల్‌ అర్థ శతకం, ఆకట్టుకోని అయ్యర్‌
అయితే, మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇచ్చే క్రమంలో ఇషాన్‌పై వేటుపడింది. ఇందుకు అనుగుణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గిల్‌ 60 బంతుల్లో 70 పరుగులు సాధించడం విశేషం. మరోవైపు.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ 28 పరుగులకే పెవిలియన్‌ చేరడం గమనార్హం.

చదవండి: Ind Vs SL-Playing XI: తొలి వన్డే.. భారత తుది జట్టు ఇదే!
Ind Vs Aus: టీమిండియాకు భారీ షాక్‌! కీలక ఆటగాడు దూరం! ఇలాగైతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేదెట్లా?!
రిచర్డ్స్‌, సచిన్‌, కోహ్లి, రోహిత్‌! కానీ ఇలాంటి బ్యాటర్‌ శతాబ్దానికొక్కడే! సూర్యను ఆకాశానికెత్తిన దిగ్గజం

మరిన్ని వార్తలు