Ind Vs Sl: కొంతమంది ఇడియట్స్‌ ఉంటారు.. ఏమీ తెలీదు.. కానీ

24 Jul, 2021 16:07 IST|Sakshi
రెండో వన్డేలో ఓటమి నేపథ్యంలో దసున్‌, ఆర్థర్‌ గొడవకు సంబంధించిన దృశ్యం

శ్రీలంక ఆటగాళ్లకు కోచ్‌ విజ్ఞప్తి

కొలంబో: టీమిండియాపై శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండోపై ఆ జట్టు కోచ్‌ మికీ ఆర్థర్‌ ప్రశంసలు కురిపించాడు. ఫిట్‌నెస్‌ లోపాల కారణంగా వారిద్దరు కొన్ని మ్యాచ్‌లు మిస్పయ్యారని, అయితే ఇప్పుడు గాడిలో పడ్డారని పేర్కొన్నాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఇరువురి ప్రదర్శన తనకెంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. భానుక మంచి కోసమే, కొన్నిసార్లు తన పట్ల కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చిందని మికీ ఆర్థర్‌ చెప్పుకొచ్చాడు.

కాగా నామమాత్రపు మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో  శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని భారత జట్టును ఓడించి ఆతిథ్య శ్రీలంక జట్టు ఓదార్పు విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తద్వారా 10 మ్యాచ్‌ల తర్వాత స్వదేశంలో టీమిండియాపై గెలుపొంది.. వరుస పరాజయాలకు చెక్‌ పెట్టగలిగింది. ముఖ్యంగా  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవిష్క ఫెర్నాండో (98 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్‌), భానుక రాజపక్స (56 బంతుల్లో 65; 12 ఫోర్లు) హాఫ్‌ సెంచరీలతో జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఈ నేపథ్యంలో మికీ ఆర్థర్‌ లంక జర్నలిస్టులతో మాట్లాడుతూ... ఎట్టకేలకు భారత్‌పై గెలుపొందడం సంతోషంగా ఉందన్నాడు. ఇక వరుస ఓటముల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తమపై వస్తున్న ట్రోల్స్‌ను ఉద్దేశించి... దయచేసి సామాజిక మాధ్యమాలకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు. ‘‘కొంతమంది ఇడియట్స్‌ ఉంటారు. వాళ్లకే అంతా తెలుసనని భావిస్తారు. నిజానికి వాళ్లకు అసలేమీ తెలియదు. కాబట్టి వారికి దూరంగా ఉండటం మంచిది’’ అంటూ మికీ ఆర్థర్‌ వ్యాఖ్యానించాడు.

కాగా రెండో వన్డేలో ఓటమి దిశగా పయనిస్తున్నపుడు ఆర్థర్‌, లంక కెప్టెన్‌ దసున్‌ శనక గొడవ పడటం.. అదే విధంగా చివరిదైన మూడో వన్డేలో 23వ ఓవర్‌లో డీఆర్‌ఎస్‌ విషయంలో దసున్‌ సేన తత్తరపాటుకు గురికావడం వంటి అంశాల నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇక మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు