Ind Vs SL: మ్యాచ్‌ విజయం; డ్రెస్సింగ్‌ రూంలో ద్రవిడ్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

21 Jul, 2021 12:54 IST|Sakshi

కొలంబో: శ్రీలంకపై రెండో వన్డే విజయం అనంతరం టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ డ్రెస్సింగ్‌ రూంలో​ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ విజయం చాలా గొప్పదని.. మ్యాచ్‌లో అందరు మంచి ప్రదర్శన కనబరిచారని తెలిపాడు. ద్రవిడ్‌ ఇచ్చిన ఎమోషనల్‌ స్పీచ్‌ వైరల్‌గా మారింది. ద్రవిడ్‌ వ్యాఖ్యలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది.

ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ''వాళ్లు ఈ మ్యాచ్‌లో బాగా ఆడారు.. కానీ సరైన సమయంలో మనం ఒక చాంపియన్‌ టీమ్‌లా ఆడాం. ఓటమి కోరల్లో నుంచి బయటపడేందుకు దృడ సంకల్పంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుంజుకున్నాం. ఇది గొప్ప విజయం.. వెల్‌డన్‌ బాయ్స్‌. ఒక దశలో ఒత్తిడి లోనైన నేను మ్యాచ్‌ ఎటు పోతుందో అర్థం చేసుకోలేకపోయా. కానీ ఈ విజయం మనకు ఇంకో పది మ్యాచ్‌ల వరకు మంచి బూస్టప్‌ ఇస్తుంది. ఇక ఒత్తిడిని తట్టుకుంటూ చహర్‌ అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనికి భువనేశ్వర్‌ సహకరించిన తీరు కూడా బాగుంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేద్దాం'' అంటూ చెప్పుకొచ్చాడు.


దీపక్‌ చహర్‌ను అభినందిస్తున్న కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. 

మరిన్ని వార్తలు