Ind Vs Sl: అక్కడ ఉన్నది ద్రవిడ్‌ మరి.. అందుకే ఆ నిర్ణయం

24 Jul, 2021 17:33 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ‘‘సిరీస్‌ కైవసం చేసుకున్నప్పటికీ.. నామమాత్రపు మ్యాచ్‌లో కూడా చాలా వరకు జట్లు తమ రెగ్యులర్‌ ఆటగాళ్లనే ఎంపిక చేసుకుంటాయి. మ్యాచ్‌ ఓడిపోతామనే భయంతో తుదిజట్టులో కొత్త వాళ్లకు అస్సలు చోటు ఇవ్వరు. వారిని ప్రోత్సహించేందుకు వెనకాడతారు. అయితే, మరి రాహుల్‌ ద్రవిడ్‌ వంటి వ్యక్తులు ఉన్నపుడు పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది కదా’’ అని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రజా టీమిండియా మాజీ ఆటగాడు, ద్వితీయ శ్రేణి జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఒకే మ్యాచ్‌లో ఐదుగురు యువ క్రికెటర్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని కితాబిచ్చాడు.

శ్రీలంక పర్యటనలో భాగంగా శుక్రవారం నాటి చివరిదైన మూడో వన్డేలో ధావన్‌ సేన ఐదు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. సంజూ శాంసన్‌, నితీశ్‌ రాణా, రాహుల్‌ చహర్‌, చేతన్‌ సకారియా, క్రిష్ణప్ప గౌతం ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టారు. 1980 నాటి ఆస్ట్రేలియా టూర్‌ తర్వాత ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేయడం తొలిసారి. ఇక నిన్నటి మ్యాచ్‌లో సంజూ 46 పరుగులతో రాణించగా, సకారియా 2, రాహుల్‌ చహర్‌ 3, గౌతం 1 వికెట్‌ తీసి ఆకట్టుకున్నారు. మ్యాచ్‌ ఓడిపోయినప్పటికీ యాజమాన్యం నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో రమీజ్‌ రజా మాట్లాడుతూ... ‘‘ఒకే మ్యాచ్‌లో ఐదురుగు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా మంచి విషయం. మేనేజ్‌మెంట్‌ గొప్ప నిర్ణయం తీసుకుంది. సిరీస్‌ గెలిచినప్పటికీ మిగతా ఆసియా జట్ల మెంటాలిటీ ఇలా ఉండదు. ఓటమి భయాలతో వెనకడుగు వేస్తారు. కానీ, టీమిండియా అలా ఆలోచించలేదు. ఎందుకంటే ద్రవిడ్‌ది ఒక భిన్నశైలి. గెలుపోటముల గురించి తను లెక్కచేయడు. బెంచ్‌ను మరింత దృఢపరచడమే తనకు తెలిసింది. తన నిర్ణయాలతో భవిష్యత్తులో భారత్‌కు మరింత మంది మెరికల్లాంటి ఆటగాళ్లు దొరకడం ఖాయం’’ అని ద్రవిడ్‌ వ్యక్తిత్వాన్ని ప్రశంసించాడు. కాగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు