Rohit Sharma: అందుకే ఆ రనౌట్‌ అప్పీలు వెనక్కి తీసుకున్నాం.. ఇక షమీ! లవ్‌ యూ భాయ్‌..

11 Jan, 2023 11:10 IST|Sakshi
షనక రనౌట్‌ విషయంలో భారత్‌ క్రీడాస్ఫూర్తి (PC: Twitter Video Grab)

India vs Sri Lanka, 1st ODI- Rohit Sharma: శ్రీలంకపై భారీ గెలుపుతో వన్డే సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. గువహటి వేదికగా తొలి వన్డేలో రోహిత్‌ సేన పర్యాటక లంకపై 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 83, మరో ఓపెనర్‌ 70 పరుగులతో చెలరేగగా.. విరాట్‌ కోహ్లి సెంచరీ(113)తో మెరవడం హైలైట్‌గా నిలిచాయి.

సెంచరీకి రెండే పరుగుల దూరంలో
ఇదిలా ఉంటే.. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకను గెలిపించేందుకు ఆ జట్టు సారథి దసున్‌ షనక శాయశక్తులా ప్రయత్నించాడు. భారత గడ్డపై తొలి సెంచరీ(108 .. నాటౌట్‌) సాధించి సత్తా చాటాడు. అయితే, లంక ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన భారత పేసర్‌ మహ్మద్‌ షమీ... సెంచరీకి రెండే పరుగుల దూరంలో ఉన్న షనక (98 వద్ద) రనౌట్‌(మన్కడింగ్‌) చేశాడు. నిజానికి ఇది అవుటే! కానీ కెప్టెన్‌ రోహిత్‌... షమీ దగ్గరకొచ్చి వారించాడు. 

అందుకే వెనక్కి తీసుకున్నాం
వెంటనే షమీ అంపైర్‌తో అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో షనక ఐదో బంతికి ఫోర్‌ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోగలిగాడు. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘‘షమీ రనౌట్‌ చేశాడని నాకు తెలియదు. షనక 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో తను ఎందుకు అప్పీలు చేశాడో తెలియదు. ఏదేమైనా.. షనక అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. 

తనను మరీ ఇలా అవుట్‌ చేయాలనుకోవడం భావ్యం కాదు కూడా! మేము అలా అనుకోలేదు! హ్యాట్సాఫ్‌ షనక. తను నిజంగా అత్యద్భుతంగా ఆడాడు’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. తన విషయంలో వెనక్కి తగ్గినా పర్లేదనుకున్నామని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా షనక విషయంలో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన హిట్‌మ్యాన్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా అతడిని కొనియాడుతూ.. ‘‘లవ్‌ యూ భాయ్‌’’ అని పోస్టులు పెడుతున్నారు.

ఇండియా వర్సెస్‌ శ్రీలంక తొలి వన్డే స్కోర్లు:
ఇండియా- 373/7 (50)
శ్రీలంక- 306/8 (50)
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: విరాట్‌ కోహ్లి

చదవండి: WTC: భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. మూడున్నరేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ
IND vs SL: వారెవ్వా.. సిరాజ్‌ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్‌


 

>
మరిన్ని వార్తలు