IND Vs SL: ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గబ్బర్‌ జట్టుపై భువీ సేన విజయం

6 Jul, 2021 18:46 IST|Sakshi

కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టు.. క్వారంటైన్ పూర్తి చేసుకొని, తాజాగా ఓ ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడింది. కెప్టెన్ ధవన్, వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్‌ల నేతృత్వంలో రెండు జట్లుగా విడిపోయి ఈ సన్నాహక మ్యాచ్‌ ఆడుతున్నారు. ఇందులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ధవన్‌ జట్టు.. అద్భుతంగా రాణించి, నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది.

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మనీశ్ పాండే(45 బంతుల్లో 63) అర్ధశతకంతో రాణించగా, రుతురాజ్ గైక్వాడ్, ధవన్ పర్వాలేదనిపించారు. ప్రత్యర్ధి కెప్టెన్‌ భువనేశ్వర్ కుమార్‌(2/23) బౌలింగ్‌లో రాణించాడు. అనంతరం ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌, పృథ్వీ షా, పడిక్కల్‌లు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో భువీ సేన 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని అద్భుత విజయం సాధించింది. 

ఇదిలా ఉంటే, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో లంకకు బయల్దేరిన టీమిండియా.. ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడనుంది. ఇందు కోసం 20 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసిన భారత సెలెక్షన్ కమిటీ.. ఐదుగురిని నెట్ బౌలర్లుగా ఎంపిక చేసింది. కోహ్లీ నేతృత్వంలోని భారత రెగ్యులర్‌ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రయోగాత్మకంగా శిఖర్ ధవన్ నేతృత్వంలోని యువ జట్టును శ్రీలంకకు పంపింది. ఐపీఎల్, భారత్ ఏ తరఫున సత్తా చాటిన ఆటగాళ్లను ఈ టూర్‌కు ఎంపిక చేసింది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఈనెల 13న జరుగనుంది.

భారత జట్టు: శిఖర్‌ ధవన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చహర్‌, కృష్ణప్ప గౌతం, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా

నెట్‌ బౌలర్లు: ఇషాన్‌ పోరెల్‌, సందీప్‌ వారియర్‌, అర్షదీప్‌ సింగ్‌, సాయి కిషోర్‌, సిమ్రన్‌ జీత్‌ సింగ్‌

>
మరిన్ని వార్తలు