Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌.. త్వరలోనే అక్తర్‌ను కూడా!

4 Jan, 2023 10:40 IST|Sakshi
ఉమ్రాన్‌ మాలిక్‌

India vs Sri Lanka, 1st T20I- Umran Malik: శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అరంగేట్రంలో అదరగొట్టిన బౌలర్‌ శివం మావి(4 వికెట్లు)కి తోడుగా రెండు వికెట్లతో రాణించాడు. వాంఖడే మ్యాచ్‌లో తన బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఉమ్రాన్‌.. మొత్తంగా 27 పరుగులు ఇచ్చాడు. చరిత్‌ అసలంక(12), లంక కెప్టెన్‌ దసున్‌ షనక(45) వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే, షనకను అవుట్‌ చేసే క్రమంలో ఈ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ విసిరిన బంతి మ్యాచ్‌లో ఫాస్టెస్ట్‌ బాల్‌గా నిలిచింది. పదిహేడో ఓవర్‌లో ఉమ్రాన్‌ వేసిన నాలుగో బంతిని ఎక్స్‌ట్రా కవర్‌ ఆడే దిశగా ఆడేందుకు షనక ప్రయత్నించాడు. అయితే, మనోడి ఎక్స్‌ ట్రా పేస్‌ కారణంగా అతడి ప్రయత్నం ఫలించలేదు. 

ఫాస్టెస్ట్‌ బాల్‌
చహల్‌ క్యాచ్‌ అందుకోవడంతో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షనక నిష్క్రమించాల్సి వచ్చింది. ఇంతకీ ఉమ్రాన్‌ వేసిన బంతి స్పీడ్‌ ఎంతంటే గంటకు 155 కిలోమీటర్లు(155kph). ఈ స్పీడ్‌స్టర్‌ నైపుణ్యం చూసిన కెప్టెన్‌, పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చిరునవ్వుతో అతడిని మైదానంలోనే అభినందించాడు.

నిజానికి లంక టాప్‌ స్కోరర్‌గా ఉన్న షనకను అవుట్‌ చేయకపోతే ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదు! కాగా ఈ మ్యాచ్‌ సందర్భంగా అత్యంత వేగంగా బంతిని విసిరిన ఉమ్రాన్‌.. జట్టు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా పేరిట ఉన్న రికార్డును కనుమరుగు చేశాడు.

బుమ్రా రికార్డు బద్దలు
బుమ్రా గతంలో 153.36 kmph స్పీడ్‌తో బౌలింగ్‌ చేయగా.. మహ్మద్‌ షమీ(153.3 kmph), నవదీప్‌ సైనీ (152.85 kmph) అతడి తర్వాతి స్థానాల్లో ఉండేవాళ్లు. ఇప్పుడు వీళ్లందరిని ఉమ్రాన్‌ వెనక్కినెట్టాడు. టీమిండియా పేసర్లలో ఫాస్టెస్ట్‌ బాల్‌ విసిరిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌కు ముందు ఉమ్రాన్‌.. పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే నువ్వు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధిగమిస్తావు అంటూ ఫ్యాన్స్‌ ఉమ్రాన్‌ పేరును ట్రెండ్‌ చేస్తున్నారు.

చదవండి: జంపా మన్కడింగ్.. క్రీజు దాటినా నాటౌట్ ఇచ్చిన అంపైర్‌! ఎందుకో తెలుసా?
Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి

మరిన్ని వార్తలు