IND VS SL: సరిగ్గా నాలుగేళ్ల క్రితం; ఇదే శ్రీలంక.. అప్పుడు భువీనే

21 Jul, 2021 10:00 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సూపర్‌ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) విజయంలో కీలకపాత్రపోషించగా.. చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌ 19 నాటౌట్‌తో అతనికి సహకరించాడు. ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. ఈ విజయంతో ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా అచ్చం ఇదే తరహాలో 2017లో ఇదే శ్రీలంకపై భారత్‌ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో కూడా భువీనే ఉండడం విశేషం.

ధోనితో కలిసి 8వ వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడమే గాక అర్థసెంచరీతో రాణించాడు. ఆ మ్యాచ్‌ విషయానికి వస్తే.. 47 ఓవర్లలో 231 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా.. లంక బౌలర్‌ అఖిల ధనుంజయ(6 వికెట్లు) దెబ్బకు భారత జట్టు 22 ఓవర్లలో 131 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలోనే కెప్టెన్‌ ధోని అద్భుతం చేశాడు. భువనేశ్వర్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడిన ధోని 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడమేగాక జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక టీమిండియా ఆడిన వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు ధోని-భువీల సెంచరీ భాగస్వామ్యం తొలి స్థానంలో ఉండగా.. తాజాగా దీపక్‌ చహర్‌, భువీల మధ్య నమోదైన 84 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది.

ఇక 2009లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో ప్రవీణ్‌ కుమార్‌, హర్భజన్‌ జంట ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇక మ్యాచ్‌ అనంతరం వైస్‌ కెప్టెన్‌ హోదాలో భువీ మాట్లాడుతూ.. '' ఈరోజు మ్యాచ్‌ అచ్చం నాలుగేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌ను తలపించింది. 276 పరుగులు చేధనలో 193 పరుగుల వద్ద నేను క్రీజులోకి అడుగుపెట్టాను. ఏం జరిగినా సరే దీపక్‌ చహర్‌కు అండగా చివరి వరకు నిలబడాలని గట్టిగా అనుకున్నా.. అంతా మ్యాజిక్‌లా జరిగిపోయింది. నేను చేసింది 19 పరుగులే కావొచ్చు.. కానీ నా కెరీర్‌కు ఇది చాలా బూస్టప్‌ను ఇస్తుంది. 2017లో జరిగిన మ్యాచ్‌లోనూ అంతే.. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ధోని భయ్యాకు సహకరిస్తూ అర్థ సెంచరీ నమోదు చేశాను.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నామమాత్రమైన చివరి వన్డే జూలై 22న జరగనుంది. 

>
మరిన్ని వార్తలు