IND Vs SRI: ద్రవిడ్‌ టెన్షన్‌ను చూడలేకపోయాం.. ఓడిపోయుంటే

21 Jul, 2021 08:34 IST|Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్‌ చహర్‌ అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ ఓడిపోతున్నామన్న దశలో చహర్‌.. భువనేశ్వర్‌తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను గెలిపించడమేగాక .. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న వైస్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మ్యాచ్‌ విజయం అనంతరం పోస్ట్‌ ప్రెజంటేషన్‌లో స్పందించాడు.

''ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్‌ చూశా. దీపక్‌ చహర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ మమ్మల్ని నిలబెట్టింది. నా వరకు కీలక సమయంలో మరో వికెట్‌ పడకుండా అతనికి సహకరించడం సంతోషంగా ఉంది. ఇక మా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ విజయం తర్వాత సంతోషంగా ఉంటారనుకుంటున్నా. ఎందుకంటే మ్యాచ్‌ సమయంలో ద్రవిడ్‌ కొన్ని సార్లు టెన్షన్‌కు లోనైనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా దీపక్‌ చహర్‌ ఆడుతున్నప్పుడు అతని సోదరుడు రాహుల్‌ చహర్‌తో ద్రవిడ్‌ మాట్లాడడం కనిపించింది. అంతేగాక మ్యాచ్‌ సమయంలోనూ పదేపదే అటు ఇటు తిరగసాగాడు. ఒకవేళ​ మ్యాచ్‌ ఓడిపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఈ సిరీస్‌కు ఆయన కోచ్‌గా ఉండడం మాకు సవాల్‌. ఇక మ్యాచ్‌ విజయం తర్వాత ద్రవిడ్‌లో మళ్లీ ఆ కూల్‌ కనిపించింది.ఇక క్లీన్‌ స్వీప్‌పై దృష్టి పెట్టాం'' అంటూ చెప్పుకొచ్చాడు. 


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది.

మరిన్ని వార్తలు