Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్‌! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే..

22 Jul, 2022 12:10 IST|Sakshi
టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(ఫైల్‌ ఫొటో)

India tour of West Indies, 2022: టీమిండియా- వెస్టిండీస్‌ జట్ల మధ్య శుక్రవారం వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మొదటి మ్యాచ్‌కు తన జట్టును ఎంచుకున్నాడు. శిఖర్‌ ధావన్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగితే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు అవకాశం రాకపోవచ్చని, అతడి అరంగేట్రానికి ఇంకా సమయం ఉందని అభిప్రాయపడ్డాడు.

ఇక మూడో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ సరైనోడన్న ఆకాశ్‌.. అతడిని విండీస్‌ బౌలర్లు బౌన్సర్లతో టార్గెట్‌ చేస్తారని, షాట్‌ సెలక్షన్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో సంజూ శాంసన్‌, దీపక్‌ హుడాకు ఆకాశ్‌ చోప్రా అవకాశం ఇచ్చాడు. 

కాగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఈ సిరీస్‌కు అందుబాటులో లేని నేపథ్యంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఫినిషర్‌ పాత్ర పోషించాల్సి ఉందని ఆకాశ్‌ అన్నాడు. కాబట్టి ఆరో స్థానానికి అతడే కరెక్ట్‌ అని పేర్కొన్నాడు. ఇక తన జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లకు చోటిస్తానని ఈ మాజీ బ్యాటర్‌ పేర్కొన్నాడు. వైస్‌ కెప్టెన్‌ జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే... అతడి తర్వాత శార్దూల్‌ ఠాకూర్‌ వస్తే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

వెస్టిండీస్‌తో మొదటి వన్డేకు ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న భారత జట్టు:
శిఖర్‌ ధావన్‌, ఇసాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌.

చదవండి: Ind Vs WI ODI Series: వీళ్లతో అంత వీజీ కాదు! ఏమరపాటుగా ఉంటే మూల్యం చెల్లించకతప్పదు!

మరిన్ని వార్తలు