Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్‌ సేనకు భారీ షాక్‌! ఆలస్యంగా వెలుగులోకి..

25 Jul, 2022 11:57 IST|Sakshi
టీమిండియా(PC: ICC)

India Tour Of West Indies 2022- 1st ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉంది టీమిండియా. కాగా ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేలు ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. మొదటి వన్డేలో 3 పరుగులతో ధావన్‌ సేన గట్టెక్కగా.. రెండో వన్డేలో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తృటిలో ప్రమాదం నుంచి బయటపడి ఈ విజయాలు నమోదు చేసింది. దీంతో ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

తద్వారా పాకిస్తాన్‌ను వెనక్కినెట్టి.. ఒకే జట్టుపై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా ప్రపంచ రికార్డు సృష్టించింది కూడా! అయితే, అంతా బాగానే ఉన్నా మొదటి వన్డే తర్వాత టీమిండియాకు గట్టి ఎదురెబ్బ తగిలినట్లు సమాచారం. ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ధావన్‌ సేన మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోత పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున ఆటగాళ్లకు జరిమానా పడుతుంది. మ్యాచ్‌ ఫీజులో 20 శాతం మేర కోత విధించడం జరుగుతుంది’’ అని ఐసీసీ పేర్కొంది.

ఇక బుధవారం(జూలై 27) ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌- భారత్‌ మధ్య నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. ఆ తర్వాత రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. జూలై 29 నుంచి ఈ సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్‌ సైతం!
Ind Vs WI T20I: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..!

మరిన్ని వార్తలు