Ind Vs WI 1st T20: అతడిని తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదు! ద్రవిడ్‌ కాదు.. నువ్వేమనుకుంటున్నావు?

30 Jul, 2022 15:40 IST|Sakshi
రవీంద్ర జడేజా- శ్రేయస్‌ అయ్యర్‌(PC: BCCI)

India Vs West Indies T20 Series 2022: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌. వరుసగా రెండు అర్ధ శతకాలు సాధించడం(54, 63)తో పాటు.. మూడో వన్డేలో 44 పరుగులతో రాణించాడు. అయితే, విండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.

టీ20 ఫార్మాట్‌లో తనకు పోటీగా మారుతున్న దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌ను కాదని యాజమాన్యం తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ చేరాడు. 

పాపం హుడా!
ఇదిలా ఉంటే దీపక్‌ హుడా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో రాణించడంతో పాటు విండీస్‌తో వన్డే సిరీస్‌లో తన ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. మొదటి వన్డేలో 27 పరుగులు చేసిన అతడు.. రెండో మ్యాచ్‌లో 33 పరుగులు చేయడంతో పాటుగా.. ఒక వికెట్‌ తీశాడు. ఇక మూడో వన్డేలో అతడికి ఆడే అవకాశం రాలేదు. టీ20 మొదటి మ్యాచ్‌లోనూ యాజమాన్యం ఛాన్స్‌ ఇవ్వలేదు.

ఆల్‌రౌండర్లు ఉండాలి కదా!
ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ హుడాను ఈ మ్యాచ్‌లో ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్‌లో ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుందన్న అతడు.. హుడాకు తుది జట్టులో స్థానం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు.

ఈ మేరకు శ్రీకాంత్‌ ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడాడు. ‘‘హుడా ఎక్కడ? ఇటీవలి టీ20 మ్యాచ్‌లతో పాటు వన్డేల్లోనూ అతడు రాణించాడు. తప్పకుండా జట్టులో ఉండాల్సిన వ్యక్తి. టీ20 క్రికెట్‌లో ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది కదా! బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్లు.. అయినా బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు ఎవరైనా పర్లేదు! మొత్తానికి సదరు ఆటగాళ్లు జట్టులో ఉండాలి’’ అని పేర్కొన్నాడు.

అయితే, ఎక్స్‌పర్ట్‌ ప్యానెల్‌లో సభ్యుడైన టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా మాత్రం ఎవరైతే బాగా ఆడుతున్నారో వారికే ద్రవిడ్‌ భాయ్‌ ప్రాధాన్యం ఇస్తాడంటూ శ్రీకాంత్‌తో విభేదించాడు. ఇందుకు ఘాటుగా స్పందించిన చిక్కా.. ‘‘ఇక్కడ రాహుల్‌ ద్రవిడ్‌ ఆలోచనల గురించి అవసరం లేదు.

నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అది కూడా ఇప్పుడే చెప్పు’’ అని అడిగాడు. పరోక్షంగా టీమిండియా హెడ్‌కోచ్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇక చిక్కా ప్రశ్నకు బదులుగా.. ‘‘అవును.. ఈ మ్యాచ్‌లో హుడా ఉండాల్సింది. కచ్చితంగా అతడిని తీసుకోవాల్సింది’’ అని ఓజా పేర్కొన్నాడు. మ్యాచ్‌ విషయానికొస్తే.. రోహిత్‌ సేన 68 పరుగుల తేడాతో గెలుపొందింది.

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా తొలి టీ20:
►వేదిక: బ్రియన్‌ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్‌
►టాస్‌: వెస్టిండీస్‌- బౌలింగ్‌
►ఇండియా స్కోరు: 190/6 (20)
►వెస్టిండీస్‌ స్కోరు:  122/8 (20)
►విజేత: ఇండియా... 68 పరగుల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: దినేశ్‌ కార్తిక్‌(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు)
చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్‌.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా..

మరిన్ని వార్తలు