Axar Patel On Man Of The Match: సిక్సర్‌తో ముగించి.. ఈ మ్యాచ్‌ ప్రత్యేకం.. ఐపీఎల్‌లో కూడా!

25 Jul, 2022 12:47 IST|Sakshi
అక్షర్‌ పటేల్‌(PC: AFP)

India Tour Of West Indies 2022- Axar Patel Comments: ‘‘నిజంగా నాకు ఈ మ్యాచ్‌ ప్రత్యేకమైనది. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టు సిరీస్‌ గెలవడంలో నా వంతు పాత్ర పోషించాను. ఐపీఎల్‌లోనూ ఇదే తరహాలో ఆడేవాళ్లం. అవసరమైన సమయంలో రాణించడం ముఖ్యం. దాదాపు ఐదేళ్ల తర్వాత నేను వన్డే మ్యాచ్‌ ఆడాను. ఇక ముందుకు కూడా ఇదే విధంగా మంచి ఇన్నింగ్స్‌ ఆడి జట్టు గెలుపులో భాగం కావడానికి కృషి చేస్తాను’’ అని టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ హర్షం వ్యక్తం చేశాడు.

వెస్టిండీస్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వన్డే జట్టులో పునరాగమనం చేశాడు బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌. మొదటి వన్డేలో 21 పరుగులు చేశాడు. అయితే, వికెట్లేమీ తీయలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీయడంతో పాటు 64 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

సిక్సర్‌ కొట్టి..
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్‌ మేయర్స్‌ బౌలింగ్‌లో చివరి ఓవర్‌ నాలుగో బంతికి సిక్సర్‌ బాది భారత్‌ విజయాన్ని ఖరారు చేశాడు. భారీ షాట్‌తో అజేయంగా ఇన్నింగ్స్‌ ముగించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అక్షర్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ఈ విజయం తనకు చిరస్మరణీయ జ్ఞాపకంగా  మిగిలిపోతుందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. 

ఇక టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ సైతం అక్షర్‌ ఆడిన తీరును కొనియాడారు. అదే విధంగా ఫ్యాన్స్‌ సైతం అక్షర్‌ ఇన్నింగ్స్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో విజయంతో వన్డే సిరీస్‌ టీమిండియా సొంతమైంది. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తేడాతో విండీస్‌ను ఓడించి ధావన్‌ సేన ట్రోఫీ గెలిచింది. ఇక బుధవారం(జూలై 27) నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. 

ఇదిలా ఉంటే.. కాగా ఐపీఎల్‌-2022లో అక్షర్‌ పటేల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 13 ఇన్నింగ్స్‌ ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. 10 ఇన్నింగ్స్‌లో 182 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 42 నాటౌట్‌.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్‌
►టాస్‌: వెస్టిండీస్‌- బ్యాటింగ్‌
►వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
►సెంచరీతో చెలరేగిన విండీస్‌ బ్యాటర్‌ షాయి హోప్‌(115 పరుగులు)
►భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
►విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(64 పరుగులు, ఒక్క వికెట్‌)
►శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54) అర్ధ శతకాలు

>
మరిన్ని వార్తలు