Ind Vs WI 2nd ODI: టీమిండియా అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన నాలుగో జట్టుగా..

26 Jul, 2022 10:36 IST|Sakshi

India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ట్రినిడాడ్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి పది ఓవర్లలో టీమిండియా 100 పరుగులు సాధించడంతో ఈ గెలుపు సాధ్యమైంది. ఈ క్రమంలో శిఖర్‌ ధావన్‌ సేన అరుదైన ఘనత సాధించింది. అదేమిటంటే..

విండీస్‌తో రెండో వన్డేలో టీమిండియా ఆఖరి పది ఓవర్ల ఆట సాగిందిలా!
విజయం సాధించేందుకు భారత్‌ చివరి 10 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులు చేయాల్సిన తరుణం. అయితే, అప్పటికే ఐదు కీలక వికెట్లు కోల్పోవడంతో ఓవర్‌కు 10 పరుగులతో ఛేదన కష్టంగానే అనిపించింది. అయితే వరుసగా 3 ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టిన అక్షర్‌ పటేల్‌ ఒక్కసారిగా మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. ఆపై పరిస్థితి 5 ఓవర్లలో 48 పరుగులకు మారింది.

తర్వాతి రెండు ఓవర్లలో భారత్‌ 16, 13 పరుగుల చొప్పున రాబట్టడంతో సమీకరణం 3 ఓవర్లలో 19 పరుగులకు చేరింది. ఈ క్రమంలో దీపక్‌ హుడా, శార్దుల్ ఠాకూర్‌, అవేశ్‌ ఖాన్‌ అవుటైనా... ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ మాత్రం పట్టుదలగా చివరి వరకు నిలబడ్డాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరం కాగా, తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి.

భారత్ అరుదైన ఘనత
అయితే మేయర్స్‌ నాలుగో బంతిని ఫుల్‌టాస్‌గా వేయడంతో నేరుగా సిక్స్‌ కొట్టిన అక్షర్‌ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను భారత్‌కు అందించిన విషయం తెలిసిందే. కాగా వన్డే మ్యాచ్‌ చివరి 10 ఓవర్లలో 100కు పైగా పరుగులు సాధించి ఒక జట్టు విజయాన్ని అందుకోవడం 2001 నుంచి ఇది నాలుగోసారి మాత్రమే.

బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్‌ (109 పరుగులు), ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్‌ (102), ఐర్లాండ్‌పై న్యూజిలాండ్‌ (101), ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ (100) సాధించాయి. గతంలో భారత జట్టు అత్యుత్తమంగా 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 91 పరుగులు చేసింది.  ఇదిలా ఉంటే వెస్టిండీస్‌- టీమిండియా మధ్య బుధవారం(జూలై 27) మూడో వన్డే జరుగనుంది.  

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
టాస్‌: వెస్టిండీస్‌- బ్యాటింగ్‌
వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
సెంచరీతో చెలరేగిన షై హోప్‌(115 పరుగులు)
భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(35 బంతులు ఎదుర్కొని 64 పరుగులు- నాటౌట్‌, ఒక వికెట్‌)
అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54)

చదవండి: Team India Creates World Record: చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డేల్లో ప్రపంచ రికార్డు..

>
మరిన్ని వార్తలు