Shreyas Iyer: సిరీస్‌ గెలిచినా.. ఆ విషయంలో అయ్యర్‌కు నిరాశ! ద్రవిడ్‌ సర్‌ చాలా టెన్షన్‌ పడ్డారు!

25 Jul, 2022 16:27 IST|Sakshi
శ్రేయస్‌ అయ్యర్‌(PC: BCCI)

మూడో వన్డేలోనైనా సెంచరీ సాధిస్తా!

India Vs West Indies 2nd ODI- Shreyas Iyer Comments: ‘‘రెండో వన్డేలో మంచి స్కోరు నమోదు చేయడం పట్ల సంతోషంగా ఉన్నాను. అయితే, నేను అవుటైన విధానం కాస్త నిరాశపరిచింది. తదుపరి మ్యాచ్‌లో మరింత మెరుగ్గా రాణించి సెంచరీ సాధించాలని కోరుకుంటున్నా’’ అని టీమిండియా యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. విండీస్‌తో రెండో వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకాన్ని శతకంగా మార్చలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు.

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ నేపథ్యంలో అయ్యర్‌ వరుస హాఫ్‌ సెంచరీలు సాధించాడు. మొదటి వన్డేలో 54 పరుగులు, రెండో వన్డేలో 63 పరుగులతో ఫామ్‌లోకి వచ్చాడు. తద్వారా రెండు మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.

సెంచరీలుగా మలిస్తే బాగుండేది!
ఈ నేపథ్యంలో ఆదివారం నాటి రెండో వన్డేలో ధావన్‌ సేన విజయానంతరం శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘‘నిజంగా వరుసగా రెండు ఫిఫ్టీలు బాదడం అదృష్టంగా భావిస్తున్నా. అయితే, వాటిని సెంచరీలుగా మలిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే నా ఇన్నింగ్స్‌ అద్భుతంగా ఆరంభమయ్యాయి. 

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి అరుదైన సందర్భాలు అరుదు. కాబట్టి హాఫ్‌ సెంచరీలను శతకాలుగా మార్చి ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఈరోజు ఆ ఛాన్స్‌ మిస్సయ్యాను’’ అని పేర్కొన్నాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టెన్షన్‌కు గురయ్యాడని అయ్యర్‌ తెలిపాడు. 

‘‘నిజానికి నరాలు తెగే ఉత్కంఠ. రాహుల్‌ సర్‌ తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. ఆయన ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు. అయితే, మేము మాత్రం కామ్‌గానే ఉన్నాము’’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో 33వ ఓవర్‌లో అయ్యర్‌.. విండీస్‌ బౌలర్‌ అల్జారీ జోసెఫ్‌ సంధించిన యార్కర్‌ను ఎదుర్కోలేక ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక విండీస్‌ ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో రోవ్‌మన్‌ పావెల్‌ ఇచ్చిన క్యాచ్‌ అందుకున్నాడు. 

ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బుధవారం (జూలై 27)న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగనుంది.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ రెండో వన్డే
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్‌
►టాస్‌: వెస్టిండీస్‌- బ్యాటింగ్‌
►వెస్టిండీస్‌ స్కోరు: 311/6 (50 ఓవర్లు)
►సెంచరీతో చెలరేగిన విండీస్‌ బ్యాటర్‌ షాయి హోప్‌(115 పరుగులు)
►భారత్‌ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు)
►విజేత: భారత్‌.. 2 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: అక్షర్‌ పటేల్‌ ‌(64 పరుగులు, ఒక్క వికెట్‌)
►శ్రేయస్‌ అయ్యర్‌(63), అక్షర్‌ పటేల్(64‌), సంజూ శాంసన్‌(54) అర్ధ శతకాలు

చదవండి: Axar Patel On Man Of The Match: సిక్సర్‌తో ముగించి.. ఈ మ్యాచ్‌ ప్రత్యేకం.. ఐపీఎల్‌లో కూడా!

మరిన్ని వార్తలు