IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు

1 Aug, 2022 13:05 IST|Sakshi

వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తుంది. సెయింట్‌ కిట్స్‌ వేదికగా ఇవాళ (ఆగస్ట్‌ 1) రాత్రి  8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్‌ మరో 57 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్‌ ఖాతాలో 3443 పరుగులు (129 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి.

తాజా ఫామ్‌ (తొలి టీ20లో 64 పరుగులు) ప్రకారం చూస్తే.. రోహిత్‌ ఈ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌ మరో రెండు రికార్డులపై కూడా కన్నేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లలో) 16000 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు 44 పరుగుల దూరంలో ఉన్నాడు.

అలాగే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ 11 సిక్సర్లు బాదగలిగితే అంతర్జాతీయ టీ20ల్లో కివీస్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (169) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమిస్తాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ఇరు జట్లలోని పలువురు ఆటగాళ్లను కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏవంటే..

  • అంతర్జాతీయ టీ20ల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకునేందుకు రవీంద్ర జడేజా వికెట్ దూరంలో, హార్దిక్ పాండ్యా రెండు వికెట్ల దూరంలో ఉన్నారు.
  • శ్రేయస్ అయ్యర్‌కు టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి 69 పరుగులు కావాలి. 
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 100 ఫోర్లు పూర్తి చేయడానికి సూర్యకుమార్ యాదవ్ (95)కు ఐదు ఫోర్లు అవసరం.
  • నికోలస్ పూరన్ అంతర్జాతీయ టీ20ల్లో 100 ఫోర్ల మార్కుకు ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు.
  • షిమ్రోన్ హెట్‌మైర్‌కు మూడు ఫార్మాట్‌లలో 3000 పరుగులు పూర్తి చేసేందుకు 35 పరుగులు కావాలి.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 100 ఫోర్ల మార్కుకు బ్రాండన్‌ కింగ్ (95) ఐదు ఫోర్ల దూరంలో ఉన్నాడు.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్లు సాధించడానికి ఆల్జారీ జోసెఫ్‌కు మరో 4 వికెట్లు కావాలి.

ఇదిలా ఉంటే, విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 68పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: టీమిండియా ఆధిపత్యం కొనసాగేనా..? రెండో టీ20లో విండీస్‌తో 'ఢీ'కి రెడీ అయిన రోహిత్‌ సేన
 

>
మరిన్ని వార్తలు