Ind Vs WI 3rd ODI: అతడి అరంగేట్రం ఇప్పుడే కుదరదు! వాళ్లిద్దరి స్థానాలు ఎవరూ భర్తీ చేయలేరు!

27 Jul, 2022 18:26 IST|Sakshi
రుతురాజ్‌ గైక్వాడ్‌(PC: BCCI)

India Tour Of West Indies 2022- ODI Series: అంతర్జాతీయ వన్డేల్లో అడుగుపెట్టేందుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంకొన్నాళ్లు ఎదురుచూడక తప్పదని భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో ఆఖరి వన్డేలో ఈ టీమిండియా యువ బ్యాటర్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని పేర్కొన్నాడు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో 25 ఏళ్ల రుతు అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఇక గతేడాది టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రుతురాజ్‌ గైక్వాడ్‌ వన్డే జట్టుకు ఎంపికైనప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లోనైనా ఛాన్స్‌ వస్తుందేమోనని ఎదురుచూసిన ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌కు రెండు సార్లు మొండిచేయే ఎదురైంది.

మొదటి, రెండు వన్డేల్లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి శుబ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. అంతేకాదు.. మొదటి వన్డేలో 64 పరుగులు, రెండో వన్డేలో 43 పరుగులతో రాణించాడు. దీంతో ప్రస్తుతం అతడిని కదిలించే పరిస్థితి లేదు. మరోవైపు.. గిల్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ సైతం రుతుకు పోటీగా ఉన్నాడు. 

అసలు సమస్య ఇదే!
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అయినా మూడో వన్డేకు టీమిండియా మార్పులు ఎందుకు చేస్తుంది? శుబ్‌మన్‌ గిల్‌ ఒకటి, రెండు వన్డేల్లో బాగా ఆడిన తర్వాత కూడా అతడిని ఎందుకు పక్కనపెడతారు? ఇక్కడ ఇదే అసలు సమస్య.

ప్లేయర్లను ఎలా రొటేట్‌ చేయాలో ఎవరికీ తెలియదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు. శిఖర్‌ ధావన్‌ ఒకే ఒక్క ఫార్మాట్‌లో ఆడుతున్నాడు. పైగా అతడు ఈ సిరీస్‌ కెప్టెన్‌. కాబట్టి తనకు విశ్రాంతినివ్వడం కుదరదు. కాబట్టి రుతురాజ్‌ అవకాశం కోసం మరి కొన్నాళ్లు వేచిచూడక తప్పదు’’ అని పేర్కొన్నాడు.

వాళ్లిద్దరిని ఎవరూ రీప్లేస్‌ చేయలేరు!
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఆకాశ్‌ చోప్రా.. రుతురాజ్‌ విషయంలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అదే విధంగా.. టీమిండియాలో హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా స్థానాలను భర్తీ చేయగల ఆల్‌రౌండర్లు లేరని ఆకాశ్‌ అభిప్రాయపడ్డాడు. 

‘‘హార్దిక్‌ పాండ్యా మీడియమ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌. అలాంటి లక్షణాలు ఉన్న ఆటగాడు దేశంలో మనకు ఎక్కడా దొరకడు. ఇక జడేజా.. టెస్టుల్లో సెంచరీలు చేయడం సహా వికెట్లు కూలుస్తూ అద్బుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. వన్డేలు, టీ20లలో కూడా అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇలాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లను రీప్లేస్‌ చేయడం ఎవరి తరం కాదు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

కాగా బుధవారం(జూలై 27) నాటి ఆఖరి వన్డే తర్వాత.. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు జూలై 29 నుంచి టీ20 సిరీస్‌ ఆడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున రుతురాజ్‌ గైక్వాడ్‌ గతేడాది అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.  ఇక ట్రనిడాడ్‌ వేదికగా మొదలైన మూడో వన్డేలోనూ ఆకాశ్‌ చెప్పినట్లే రుతుకు చోటు దక్కలేదు. ధావన్‌తో కలిసి గిల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు.
చదవండి: T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్‌ గెలిస్తే..
Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! సిరీస్‌ మొత్తానికి అతడు దూరం?

మరిన్ని వార్తలు