IND vs WI 3rd ODI: విజయమా... ప్రయోగమా!

1 Aug, 2023 05:33 IST|Sakshi

నేడు మూడో వన్డే బరిలో భారత్‌

వెస్టిండీస్‌తో సిరీస్‌ తేల్చే చివరి పోరు

రాత్రి 7 గంటల నుంచి డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత ‘మేం భవిష్యత్తుపై దృష్టి పెట్టాం. ప్రస్తుత ఫలితాలు ముఖ్యం కాదు. అందుకే భిన్నమైన కూర్పుతో తుది జట్టు కోసం ప్రయోగాలు చేస్తున్నాం’ అని భారత కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించారు. నిజంగానే ద్రవిడ్‌ మాటలను చేతలకు అన్వయిస్తే మరోసారి రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి మ్యాచ్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకోవడం ఖాయం. ఇలాంటి స్థితిలో భారత్‌ చివరి వన్డేలో నెగ్గి సిరీస్‌ గెలుచుకుంటుందా లేక గత మ్యాచ్‌లాగే తలవంచుతుందా చూడాలి. 
 
తరూబా (ట్రినిడాడ్‌): వన్డే వరల్డ్‌కప్‌ ఆతిథ్య జట్టు హోదాలో సిద్ధమవుతున్న భారత్‌ జట్టు వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించని టీమ్‌తో సిరీస్‌ విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య సిరీస్‌ ఫలితాన్ని తేల్చే చివరిదైన మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలోనే కష్టంగా నెగ్గిన టీమిండియా... రెండో వన్డేలో ఓటమిపాలు కావడంతో సిరీస్‌ 1–1గా సమంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మూడో వన్డే ఏకపక్షంగా మారకుండా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.  

ఆ ఇద్దరికీ...
రోహిత్, కోహ్లి గత మ్యాచ్‌లాగే ఆడకపోతే భారత జట్టుకు సంబంధించి ఇద్దరు బ్యాటర్లపై ప్రధానంగా చర్చ సాగనుంది. తమను తాము నిరూపించుకోవాల్సిన స్థితిలో సూర్యకుమార్‌ యాదవ్, సంజూ సామ్సన్‌లు బరిలోకి దిగుతున్నారు. కోచ్‌ చెప్పిన దాన్ని బట్టి వీరిద్దరికి మరో అవకాశం ఖాయం. సూర్య వన్డేల్లో ఇంకా తడబడుతుండగా... చాలా కాలం తర్వాత దక్కిన అవకాశాన్ని సామ్సన్‌ ఉపయోగించుకోలేకపోయాడు.

మూడు, నాలుగు స్థానాల్లో వీరు రాణిస్తే జట్టుకు మేలు కలుగుతుంది. ఇషాన్‌ కిషన్‌ ఆకట్టుకోగా, గిల్‌ ఇంకా ప్రభావం చూపలేదు. హార్దిక్‌ కూడా అంచనాలకు తగిన విధంగా రెండు విభాగాల్లోనూ రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌లో ఉమ్రాన్, ముకేశ్, కుల్దీప్‌లు తమ సత్తా మేరకు ఆడితే విండీస్‌ను కట్టడి చేయగలరు. జడేజా, అక్షర్‌ కూడా రాణిస్తే భారత్‌ విజయావకాశాలు మెరుగవుతాయి.  

ఆత్మవిశ్వాసంతో...
తొలి వన్డేలో కుప్పకూలినా... రెండో మ్యాచ్‌లో గెలుపు విండీస్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముఖ్యంగా కెపె్టన్‌ షై హోప్‌ చక్కటి ఫామ్‌తో ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. మేయర్స్‌ గత మ్యాచ్‌లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించాడు. కింగ్, అతనజ్‌ కూడా రాణించడంతో పాటు కార్టీ కూడా నిలబడితే జట్టు మంచి స్కోరు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

విండీస్‌ బౌలింగ్‌ గత మ్యాచ్‌లో ఆకట్టుకుంది. పేసర్లలో అల్జారి జోసెఫ్‌ పదునైన పేస్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టగా రొమారియో షెఫర్డ్‌ కూడా చాలా తెలివిగా బౌలింగ్‌ చేశాడు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ గుడకేశ్‌ మోతీ కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోసారి సమష్టిగా రాణించి సొంతగడ్డపై సిరీస్‌ సాధించాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది. 

పిచ్, వాతావరణం  
బ్రియాన్‌ లారా స్టేడియం ఇప్పటి వరకు ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచి్చంది. ఈ మైదానంలో ఇదే తొలి అంతర్జాతీయ వన్డే. అయితే ఈ వేదికపై జరిగిన దేశవాళీ వన్డేల్లో స్వల్ప స్కోర్లే నమోదు కావడం పిచ్‌ పరిస్థితికి ఒక సూచిక. మ్యాచ్‌ రోజు వాన ముప్పు లేదు.

మరిన్ని వార్తలు