Ind Vs WI 3rd ODI- Playing XI: ఆవేశ్‌ అవుట్‌..! మా గుండె పగిలింది.. కానీ ఇప్పుడు!

27 Jul, 2022 19:06 IST|Sakshi
శిఖర్‌ ధావన్‌- నికోలస్‌ పూరన్‌(PC: Windies Cricket Twitter)

India Tour Of West Indies 2022- ODI Series: వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా టీమిండియా ఆఖరి వన్డేకు సిద్ధమైంది. ట్రినిడాడ్‌ వేదికగా బుధవారం (జూలై 27) ఆరంభమైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచాడు భారత తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌. తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఆవేశ్‌ ఖాన్‌ స్థానంలో ప్రసిద్‌ కృష్ణ జట్టులోకి వచ్చాడని గబ్బర్‌ తెలిపాడు.

టాస్‌ ఈ సందర్భంగా ధావన్‌ మాట్లాడుతూ.. ‘‘మేము ముందు బ్యాటింగ్‌ చేస్తాం. మంచి స్కోరు నమోదు చేయాలని భావిస్తున్నాం. మాకున్న సానుకూలాంశం ఏమిటంటే.. మా జట్టులోని ప్రతి ఆటగాడు రాణిస్తున్నాడు. ఇందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ద్రవిడ్‌ సర్‌ గొప్పగా జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఆటగాళ్లు ఎన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అంతగా రాటుదేలుతారు. ఆయన మా చేత అదే చేయిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు.

మా గుండె పగిలింది.. ఇప్పుడు
ఇక విండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌.. ‘‘మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో మా గుండె పగిలింది. అయితే, ఈరోజు మేము మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నాం. 50 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేయాలి. నిలకడ ప్రదర్శించాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందగలం’’ అని చెప్పుకొచ్చాడు.

తాము మూడు మార్పులతో మూడో వన్డే ఆడనున్నామన్న పూరన్‌.. అల్జారీ, రోవ్‌మన్‌ పావెల్‌, రొమారియో షెఫర్డ్‌ స్థానాల్లో హోల్డర్‌, కీమో, కార్టీ తుది జట్టులో చోటు దక్కించుకున్నారని తెలిపాడు. కాగా స్వదేశంలో టీమిండియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌ ఇప్పటికే సిరీస్‌ను 2-0తేడాతో కోల్పోయింది.

ఇక నికోలస్‌ పూరన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత నెదర్లాండ్స్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన వెస్టిండీస్‌.. పాకిస్తాన్‌ టూర్‌లో ఘోర పరాభవం చవిచూసింది. పాక్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా స్వదేశంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన సిరీస్‌లోనూ ఇదే తరహాలో 3-0తేడాతో క్లీన్‌స్వీప్‌ అయింది. 

మరోవైపు టీమిండియా ఇటీవలి ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీ20, వన్డే సిరీస్‌లను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక వెస్టిండీస్‌లో ఆఖరి వన్డే గెలిచి ఆతిథ్య జట్టును వైట్‌వాష్‌ చేయాలని భావిస్తోంది. మొదటి వన్డేలో 3 పరుగులు, రెండో వన్డేలో 2 వికెట్ల తేడాతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా ధావన్‌ సేన గెలుపొందిన విషయం తెలిసిందే.

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా మూడో వన్డే:
తుదిజట్లు:
ఇండియా: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), దీపక్‌ హుడా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, యజువేంద్ర చహల్‌, ప్రసిద్‌ కృష్ణ.

వెస్టిండీస్‌: షాయీ హోప్‌(వికెట్‌ కీపర్‌), బ్రాండన్‌ కింగ్‌, కీసీ కార్టీ, బ్రూక్స్‌, నికోలస్‌ పూరన్‌(కెప్టెన్‌), కైలీ మేయర్స్‌, జేసన్‌ హోల్డర్‌, కీమో పాల్‌, అకీల్‌ హొసేన్‌, హైడెన్‌ వాల్ష్‌, జేడెన్‌ సీల్స్‌.
చదవండి: World Cup 2023: అందుకే గబ్బర్‌ కెప్టెన్‌ అయ్యాడు! రోహిత్‌ శర్మ కోరుకుంటున్నది అదే!
T20 WC 2022: అతడి వల్ల టీమిండియాకు ఒరిగేదేమీ లేదు! ఒకవేళ టైటిల్‌ గెలిస్తే..

మరిన్ని వార్తలు