IND Vs WI 3rd ODI: విండీస్‌పై భారత్‌ గెలుపు.. 3-0తో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌

28 Jul, 2022 03:44 IST|Sakshi

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. ఆరుగురు ప్రధాన ఆటగాళ్లు లేకపోయినా... కుర్రాళ్లు సత్తా చాటడంతో విండీస్‌ను 3–0తో టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. రెండు హోరాహోరీ వన్డేల తర్వాత చివరి పోరులో ఆతిథ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 119 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) విండీస్‌ను చిత్తు చేసింది.

పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను కుదించారు. ముందుగా భారత్‌ 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (98 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (74 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా, శ్రేయస్‌ అయ్యర్‌ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

అనంతరం డక్‌వర్త్‌–లూయిస్‌ పద్ధతి ప్రకారం వెస్టిండీస్‌ లక్ష్యాన్ని 35 ఓవర్లలో 257 పరుగులుగా నిర్దేశించారు. అయితే విండీస్‌ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. నికోలస్‌ పూరన్‌ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌), బ్రెండన్‌ కింగ్‌ (37 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. సిరాజ్‌ తన తొలి ఓవర్లోనే మేయర్స్‌ (0), బ్రూక్స్‌ (0)లను అవుట్‌ చేయడంతో ‘సున్నా’కే 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది.

యజువేంద్ర చహల్‌ (4/17) ప్రత్యర్థిని దెబ్బ తీయగా... సిరాజ్, శార్దుల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మూడు మ్యాచ్‌లలో వరుసగా 64, 43, 98 నాటౌట్‌ (మొత్తం 205) పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. విండీస్‌ గడ్డపై ఆ జట్టును వన్డేల్లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి.

మరిన్ని వార్తలు