Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్‌.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!

28 Jul, 2022 11:53 IST|Sakshi
శుబ్‌మన్‌ గిల్‌

India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI:  శుబ్‌మన్‌ గిల్‌.. కుడిచేతి వాటం గల ఈ పంజాబ్‌ యువ బ్యాటర్‌ వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా వన్డే సిరీస్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. విండీస్‌ను వారి సొంత గడ్డపై భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ కెప్టెన్‌, వెటరన్‌ ప్లేయర్‌ శిఖర్‌ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసేందుకు ఇషాన్‌ కిషన్‌ సహా రుతురాజ్‌ గైక్వాడ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నా.. వారిని కాదని గిల్‌కు అవకాశం ఇచ్చింది యాజమాన్యం.

అందుకు తగ్గట్లుగానే.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు గిల్‌. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో 64, రెండో వన్డేలో 43, మూడో వన్డేలో 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కొన్నిసార్లు షాట్ల ఎంపిక విషయంలో ఒక్కోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్‌ సమర్పించుకుని విమర్శల పాలైనా.. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు.

బెస్ట్‌ క్రికెటర్‌గా...
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జన్మించిన 22 ఏళ్ల శుబ్‌మన్‌ గిల్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌ అంటే ఆసక్తి. ఈ విషయం గమనించిన అతడి తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ కొడుకుకి మెరుగైన శిక్షణ ఇప్పించడం కోసం మొహాలీకి మకాం మార్చారు. ఈ క్రమంలో 2014 నాటి అండర్‌ 16 జిల్లా పోటీల్లో భాగంగా గిల్‌ 351 పరుగులు సాధించాడు. ఇక విజయ్‌ మర్చంచ్‌ ట్రోఫీ-2016లో అండర్‌ 16 స్థాయిలో డబుల్‌ సెంచరీ చేశాడు.

పంజాబ్‌ తరఫున 2016-17 విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా లిస్ట్‌ ఏ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ మరుసటి ఏడాది రంజీ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. రెండో మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు కూడా!

ఇక ఆడిన ప్రతి మ్యాచ్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న శుబ్‌మన్‌ గిల్‌.. బెస్ట్‌ జూనియర్‌ క్రికెటర్‌గా బీసీసీఐ నుంచి వరుసగా రెండు సార్లు అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో అండర్‌ 19 జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. ఐసీసీ అండర్‌ 19 వరల్డ్‌కప్‌ 2018 టోర్నీలో అద్బుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చాడు. 

ఈ మెగా ఈవెంట్‌లో అతడు 104.50 సగటుతో 418 పరుగులు సాధించాడు. యువ భారత జట్టు నాలుగో టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు శుబ్‌మన్‌ గిల్‌. 2018 వేలంలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని కోటీ ఎనభై లక్షలకు కొనుగోలు చేసింది. 

ఈ క్రమంలో 2018లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లో ఏడోస్థానంలో బరిలోకి దిగి 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత ఓపెనర్‌గా మారి తనను తాను నిరూపించుకున్నాడు.

 పాపం.. సెంచరీ చేజారుతూనే ఉంది!
ఈ నేపథ్యంలో 2019లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌తో గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద 2020 నాటి సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పటి వరకు 11 టెస్టులాడిన గిల్‌ అత్యధిక స్కోరు 91. ఆరు వన్డే మ్యాచ్‌లలో అతడు చేసిన అత్యధిక పరుగులు 98(నాటౌట్‌).

ప్రస్తుతం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్‌ ఐపీఎల్‌ అత్యధిక స్కోరు 96 కావడం విశేషం. దీంతో మా గిల్‌ సెంచరీ గండం గట్టెక్కలేడా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిల్‌ సైతం తాజాగా విండీస్‌తో మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసే అవకాశం చేజారిందని ఫీల్‌ అయ్యాడు.

ప్రశంసల జల్లు!
అయితే.. జట్టును గెలిపించినందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు అందుకుని విండీస్‌ వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కెప్టెన్‌ ధావన్‌ సహా వసీం జాఫర్‌ వంటి మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజా ఇన్నింగ్స్‌తో సచిన్‌ టెండుల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, సునీల్‌ గావస్కర్‌ లాంటి టీమిండియా దిగ్గజాల సరసన చోటు గిల్‌ చోటు సంపాదించాడు. టీమిండియా తరపున వన్డేల్లో 90కి పైగా పరుగులతో అజేయంగా నిలిచిన బ్యాటర్ల జాబితాలో  చేరాడు. 
చదవండి: Martin Guptill: రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు.. కివీస్‌ తరపున తొలి ఆటగాడిగా
 

మరిన్ని వార్తలు