Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!

23 Jul, 2022 10:36 IST|Sakshi

India Vs West Indies 1st ODI: ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన పోరులో ఎట్టకేలకు టీమిండియా వెస్టిండీస్‌పై విజయం సాధించింది. ట్రినిడాడ్‌ వేదికగా శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో 3 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ధావన్‌ సేన 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.

రాణించిన గబ్బర్‌, గిల్‌, అయ్యర్‌
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌, ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 64 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ 54 పరుగులు చేశాడు. 

టెన్షన్‌ పెట్టేశారు!
ఈ ముగ్గురి విజృంభణతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ సైతం గట్టిపోటీనిచ్చింది. ఓపెనర్‌ కైలీ మేయర్స్‌ 75, బ్రూక్స్‌ 46, బ్రాండన్‌ కింగ్‌ 54 పరుగులతో రాణించారు.

ఇక ఆఖర్లో అకీల్‌ హొసేన్‌ 32, రొమారియో షెపర్డ్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచి చివరి వరకు విజయం కోసం చేసిన పోరాటం వృథాగా పోయింది. మూడు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.

బాధగా ఉంది!
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ స్పందిస్తూ.. సెంచరీ కొట్టే ఛాన్స్‌ మిస్‌ అయినందుకు తీవ్ర నిరాశకు లోనైనట్లు తెలిపాడు. అయితే, ఆఖరి వరకు మ్యాచ్‌ ఇంత హోరాహోరీగా సాగుతుందని ఊహించలేదన్నాడు.

‘‘శతకం బాదే అవకాశం చేజారినందుకు కాస్త బాధగా ఉంది. అయితే, జట్టుగా మేము సాధించిన విజయం పట్ల సంతోషపడుతున్నా. మేము మంచి స్కోరు నమోదు చేశాము. కానీ.. చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ. ఈ స్థాయిలో టెన్షన్‌ పడాల్సి వస్తుందని ఊహించలేదు. ఏదేమైనా తదుపరి మ్యాచ్‌లలో మరింత మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని గబ్బర్‌ చెప్పుకొచ్చాడు.

మేము గెలిచినట్లే: పూరన్‌
ఆఖరి వరకు అద్భుత పోరాటం చేసి ఓడిపోవడం పట్ల స్పందించిన వెస్టిండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌.. ‘‘మేము గెలిచినట్లే భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో తీపి, చేదు జ్ఞాపకాలు.. అయితే, వన్డేల్లో మేము పుంజుకున్న విధానం సంతృప్తినిచ్చింది.

మిగిలిన మ్యాచ్‌లలో సత్తా చాటుతాం. మా బ్యాటర్లు అద్బుతంగా ఆడారు. బౌలర్లు అంతే అద్భుతంగా ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను కట్టడి చేశారు. ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. అయితే, ఓడినా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. వాటిపై దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.

ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌ తొలి వన్డే:
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
►టాస్‌: విండీస్‌- బౌలింగ్‌
►భారత్‌ స్కోరు: 308/7 (50 ఓవర్లు)
►వెస్టిండీస్‌ స్కోరు: 305/6 (50 ఓవర్లు)
►విజేత: భారత్‌.. 3 పరుగుల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శిఖర్‌ ధావన్‌ ‌(97 పరుగులు)
►అర్ధ శతకాలతో రాణించిన గిల్‌(64), శ్రేయస్‌ అయ్యర్‌(54)

చదవండి: IND Vs WI 1st ODI: శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఫీట్‌.. సచిన్‌ రికార్డు బద్దలు..!

మరిన్ని వార్తలు