Rahul Dravid- Shikhar Dhawan: శెభాష్‌ అబ్బాయిలు.. మనమంతా ఎవరం? చాంపియన్లం! వీడియో వైరల్‌

28 Jul, 2022 14:19 IST|Sakshi
విండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ధావన్‌ సేన(PC: BCCI)

India Tour Of West Indies 2022- ODI Series- 3rd ODI: వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించి ఫుల్‌ జోష్‌లో ఉంది టీమిండియా. యువ ఆటగాళ్లతో వన్డే సిరీస్‌ ఆడి 3-0 తేడాతో ఆతిథ్య జట్టును క్లీన్‌స్వీప్‌ చేసింది. గతేడాది శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌ విజయం తర్వాత కెప్టెన్‌గా కరేబియన్‌ గడ్డపై ధావన్‌ సారథ్యంలోని యువ జట్టు ఇలా వైట్‌వాష్‌ చేయడం గమనార్హం. కాగా భారత్‌కు విండీస్‌లో ఈ తరహా గెలుపు ఇదే తొలిసారి.

ఈ నేపథ్యంలో ఇండియన్‌ డ్రెస్సింగ్‌ రూంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌.. ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించారు. యువ ప్లేయర్లు ఇలా రాణించడం టీమిండియాకు శుభ శకునమని పేర్కొన్నారు.

మీరు సూపర్‌!
‘‘నిజంగా ఈ సిరీస్‌ చాలా గొప్పగా సాగింది. వెల్‌డన్‌. ఇంగ్లండ్‌లో ఆడిన చాలా మంది సీనియర్లు ఇక్కడికి రాలేదు. నిజంగా యువ జట్టుతో ఇక్కడికి వచ్చాము. అయినా సిరీస్‌ గెలిచాం. మీరు ఆడిన తీరు అద్భుతం. మూడు మ్యాచ్‌లలోనూ ప్రొఫెషనలిజం చూపించారు. 

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మన ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠ.. తీవ్ర ఒత్తిడిని అధిగమించి రాణించారు. మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. ఇది చాలా మంచి విషయం’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

మనం ఎవరం? చాంపియన్లం!
ఇక ధావన్‌ మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్‌ విభాగంతో పాటు బౌలింగ్‌ విభాగం అద్భుతంగా రాణించింది. మీరు అంచనాలకు మించి రాణించారు. మెరుగైన భవిష్యత్తు అడుగులు పడ్డాయి. మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కచ్చితంగా ముందుకు సాగుతారు కూడా!’’ అని స్ఫూర్తి నింపాడు.

ఇక ఆఖర్లో.. ‘‘ఈ ప్రసంగం ముగించేముందు ఒక్కసారి అందరం లేచి నిలబడండి అందరం కలిసి ఫొటో తీసుకుందాం. నేనేమో మనం ఎవరు అని అడుగుతానంటా.. మీరంతా కలిసి మనమంతా చాంపియన్స్‌ అని గట్టిగా అరవండి’’ అంటూ 36 ఏళ్ల ధావన్‌ యువ జట్టుతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కాగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా వరుసగా 3 పరుగులు, రెండు వికెట్లు, డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం 119 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో వన్డేలో తృటిలో సెంచరీ చేజార్చుకున్న శుబ్‌మన్‌ గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.

వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా మూడో వన్డే:
►వేదిక: క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌, పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌, ట్రినిడాడ్‌
►టాస్‌: ఇండియా- బ్యాటింగ్‌
►మ్యాచ్‌కు వర్షం ఆటంకి
►ఇండియా స్కోరు: 225-3 (36 ఓవర్లు)
►డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి(డీఎల్‌ఎస్‌)లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యం 257 పరుగులు

►వెస్టిండీస్‌ స్కోరు: 137-10 (26 ఓవర్లు)
►విజేత: ఇండియా- డీఎల్‌ఎస్‌ పద్ధతిలో 119 పరుగుల తేడాతో గెలుపు
►మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన ఇండియా
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: శుబ్‌మన్‌ గిల్‌(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు- నాటౌట్‌)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: శుబ్‌మన్‌ గిల్‌(64, 43, 98 పరుగులు)
చదవండి: Shubman Gill: అప్పుడేమో ద్విశతకం! 91, 96, 98 నాటౌట్‌.. పాపం సెంచరీ గండం గట్టెక్కలేడా?!
ICC ODI Rankings: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్థానం?

మరిన్ని వార్తలు